
అసంబద్ధత.. అశాస్త్రీయం
- వెబ్ కౌన్సెలింగ్‌ను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన ఉపాధ్యాయులు
- మంత్రుల పర్‌ఫామెన్స్‌కు పాయింట్లు వేసుకోవాలంటూ హితవు
- రేపు సీఎం చంద్రబాబు ఇళ్లు ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపు
- ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన డీఈఓ కార్యాలయం
- ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ సంఘీభావం
అనంతపురం రూరల్ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పెర్‌ఫార్మెన్స్ పాయింట్లు, వెబ్‌కౌన్సెలింగ్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఈ విధానం అసంబద్ధంగానూ, అశాస్త్రీయంగానూ ఉందని మండిపడ్డారు. ఈ ఆందోళనకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయాన్ని దిగ్బంధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ వారికి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు తలపెట్టే ప్రతి ఉద్యమానికీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఐక్య ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ పర్‌ఫార్మెన్స్ పాయింట్లు, వెబ్‌కౌన్సెలింగ్ పేరిట ఉపాధ్యాయులను వేధిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.
ఈ మూడేళ్ల కాలంలో మంత్రుల పర్‌ఫార్మెన్స్‌కు పాయింట్లు వేసుకోవాలని హితవు పలికారు. విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన దౌర్జన్యాలు, అక్రమాలకు పాయింట్లు వేస్తే వందకు వంద వస్తాయని ఎద్దేవా చేశారు. మంత్రులే దగ్గరుండి కార్పొరేట్ విద్యాసంస్థలను నడిపించడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోకుండా వెబ్‌కౌన్సెలింగ్ పెట్టడం ద్వారా తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మానుకుని సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించాలని, లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 23వ తేదీ తలపెట్టిన సీఎం ఇళ్లు(అమరావతిలో) ముట్టడి కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలి వెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి, నరసింహులు, కూడేరు శ్రీనివాసులు, ఎస్టీయూ రామన్న, సూర్యనారాయణరెడ్డి, గోవింద్, ఏపీటీఎఫ్ హెచ్.కులశేఖర్‌రెడ్డి, సుబ్బయ్య, పీఆర్‌టీయూ రామక్రిష్ణారెడ్డి, శ్రీధర్, యూటీఎఫ్ నాయకులు జిలాన్, రమణయ్య, ఏపీటీఏ చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, పండిట్ అసోసియేషన్ ఎర్రిస్వామి, హెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.