అయ్యవార్ల ఆగ్రహం
– డిమాండ్ల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా
– ఆందోళన ఉధతం చేస్తామని పీఆర్‌టీయూ హెచ్చరిక
అనంతపురం అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందన కోసం చాలా కాలంగా వేచి చూసినవారు ఆఖరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ సంఘమైన పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధతరూపం దాల్చుతుందని పీఆర్‌టీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రక్షణ లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు లోకల్ క్యాడర్‌ను నిర్ణయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేయాలన్నారు. సర్వీసు రూల్స్ సాధనలో టీడబ్ల్యూ, మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు. డీఎస్సీ–2008కి ఎంపికై హామీపత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు డీఎస్సీ–2012 వారికన్నా తక్కువ వేతనం వస్తోందని, వీరికి వేతన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీకి సంబంధించి పది నెలల బకాయిలు నగదుగా చెల్లించాలన్నారు.
పీఆర్, మునిసిపల్, గురుకుల, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అర్థ జీతపు సెలవు నగదుగా మార్చుకునే ఉత్తర్వులను పీఆర్సీ–2015 సిఫారసులకు అనుగుణంగా ఇవ్వాలని, పెన్షన్ నిర్ణయించడంలో వెయిటేజీని ఎనిమిది ఏళ్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జడ్పీపీఎఫ్‌ని జీపీఎఫ్‌గా మార్చాలని, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఆర్సీ–2015 వేతన స్కేళ్లను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ రూపొందించాలని, స్పెషల్ టీచర్లు రూ.398 వేతనంపై పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంంట్లు ఇవ్వాలని, 1990 – 1995 మధ్య కాలంలో నియమితులైన స్పెషల్ టీచర్లకు ఏఏఎస్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్‌వీ కేశవనాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, కార్యదర్శి ఈశ్వరరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు సి.రామకష్ణారెడ్డి, కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఫణిరాజ్‌శర్మ, వి.శివశంకర్‌రెడ్డి, నాయకులు పుల్లారెడ్డి, రవీంద్ర, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.