భారత్ శుభారంభం
ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు... యూరోప్ పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7-0తో లీడెన్ హాకీ క్లబ్ (డచ్ నేషనల్ క్లబ్)పై విజయం సాధించింది. అక్షదీప్ (18వ ని.), నికిన్ తిమ్మయ్య (21వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (38, 39వ ని.), రమన్‌దీప్ సింగ్ (43వ ని.), రఘునాథ్ (45వ ని.), యువరాజ్ వాల్మీకి (53వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాయి. ఫార్వర్డ్స్ అటాకింగ్ మొదలుపెట్టడంతో తొలి అర్ధభాగంలో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడెన్ క్లబ్ ఆటగాళ్లు స్కోరును సమం చేసేందుకు చేసిన ప్రయత్నాలను గోల్‌కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలోనూ భారత ప్లేయర్ల హవా కొనసాగింది. లీడెన్ క్లబ్‌కు లభించిన ఒకటి, రెండు అవకాశాలనూ సబ్‌స్టిట్యూట్ గోల్‌కీపర్ హర్జ్యోత్ సింగ్ అడ్డుకోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. నెదర్లాండ్స్‌లో మే నెల 31 నుంచి జూన్ 15 వరకు ప్రపంచకప్ జరగనుంది.