అధిపత్యం కోసం దేశాలు ఆరాటం
అమెరికాతోనో, రష్యా, చైనాలతోనో, లేకపోతే కొరియాతోనో పోలిస్తే మన రక్షణ సంస్థల స్వావలంబన తేలిక అనిపించవచ్చు. కానీ అలా పోల్చి చూడడం సమంజసం కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఏ దేశానికీ తీసిపోని సాంకేతిక సామర్థ్యాన్ని మనం చూపించిన మాట నిజం.
రక్షణశాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచిన మోడీ ప్రభుత్వం యూపీఏ -3 ప్రభుత్వమేనని రుజువు చేసుకుంది. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ రంగంలోనే ఉంటాయని చెప్పిన మూడు కీలక శాఖలలో రక్షణ ఒకటి. రక్షణ రహస్యాలను ప్రభుత్వేతర సంస్థలతో, ఇతర దేశాలతో పంచుకోవడమంటే శత్రువుతో పంచుకోవడమే. నిజానికి రక్షణ శాఖ స్వావలంబన సాధించాలి. ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి తయారీ మన చేతులలోనే ఉండాలని ప్రథమ ప్రధాని నెహ్రూ కొన్ని సంస్థ లను ఏర్పాటు చేశారు. క్రమేణా మరికొన్ని సంస్థలు వృద్ధి చెందాయి. అవి పరిశోధనలు చేసి రక్షణ సామగ్రి, పరికరాలను రూపొందిస్తు న్నాయి. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ముం దు ఉన్నాయి. కోట్లు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ఆధునిక సామగ్రిని రూపొందించుకుంటున్నాయి. ఉదా హరణకు ఎయిరో ఇంజన్ల తయారీకి అవసరమైన పరిశోధనలకే పది సంవత్సరాలు పట్టింది. మన శాస్త్రవేత్తలు కూడా తమ మేధాశక్తితో గణనీయమైన ఫలితాలు సాధించారు.
వేధించే ప్రశ్నలు ఎన్నో!
మనకు అతి పెద్ద సైన్యం, నౌకాదళం, వైమానికదళం ఉన్నాయి. యాభై పై చిలుకు రక్షణ పరిశోధక సంస్థలు ఉన్నాయి. హెచ్ఏ ఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎమ్ఎల్ వంటి రక్షణ శాఖ పరిశ్ర మలు ఉన్నాయి. హిందుస్థాన్ షిప్‌యార్డ్, గోవా షిప్‌యార్డ్ వంటి నౌకా నిర్మాణ కేంద్రాలూ ఉన్నాయి. కానీ ఇక్కడ తయారైన పరికరాలకు సంబం ధించి భయం కలిగించే వార్తలు వింటూ ఉంటాం. యుద్ధనౌకలలో ప్రమా దాలు, జలాంతర్గాములలో పేలుళ్లు, విమానాల పతనం, రాడార్లు మొరా యించడం వంటి వార్తలవి. నిజానికి మనకు కావలసిన ఏ చిన్న విడిభా గమైనా విదేశాల నుంచి తెచ్చుకోవలసిందేనని, ఇంకా చెప్పాలంటే మన రక్షణ పరికరాలన్నీ అక్కడ తయారైనవేనని కూడా వింటూ ఉంటాం. ఇంకా, మన రక్షణ సామర్థ్యమంతా బడా విదేశీ బహుళజాతి ఆయుధ తయారీ సంస్థల చేతులలోనే ఉందనీ వింటాం. ఎందుకలా జరిగింది? దాదాపు 70 ఏళ్ల నుంచి స్వావలంబన కోసం మనం చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైనట్టేనా? దీనికి ఎవరు బాధ్యులు? దేశ క్షేమం పట్ల శ్రద్ధ కలిగిన ప్రతి పౌరుడు వేసే ప్రశ్న ఇది.
అణ్వాయుధరంగంలో భారత్ విస్మరించరాని ఒక శక్తి. కొన్నే అయినప్ప టికీ మన విమానాలు మనమే నిర్మించుకుంటున్నాం. భారీ మిలటరీ ట్రక్కు లను తయారు చేసుకోగలుగుతున్నాం. రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇక్కడే రూపకల్పన జరిగి, ఇక్కడే రూపొందుతున్నట్టు వింటున్నాం. సుదూర లక్ష్యాలను తాకగల క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్టు కూడా విన్నాం. అంతరిక్ష ప్రయోగాలు, చంద్రయాన్ సరేసరి. అయితే ఈ విషయా లన్నీ నిజం కాదా? మనది రక్షణ వ్యవస్థలో విజయగాథే అవుతుందా? ఇది మరో దృక్కోణం, ఆశావహ దృక్కోణం. వాస్తవం ఆ రెండింటి మధ్యనే ఉంది. అమెరికాతోనో, రష్యా, చైనాలతోనో, లేకపోతే కొరియాతోనో పోలిస్తే మన రక్షణ సంస్థల స్వావలంబన తేలిక అనిపించవచ్చు. కానీ అలా పోల్చి చూడడం సమంజసం కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఏ దేశానికీ తీసిపోని సాంకేతిక సామర్థ్యాన్ని మనం చూపించిన మాట నిజం.
ముందంజ వేసినా వీడని భయాలు
ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ మన త్రివిధ దళ వ్యవ స్థల అవసరాలను చాలావరకు తీర్చగలుగుతున్నది. తాను ఉత్పత్తి చేసే పరి కరాలలో మూడు వంతులు మనం రూపకల్పన చేసుకున్నవే. పావు వంతు మాత్రం విదేశీ పరిజ్ఞానం ఆధారంగా తయారవుతున్నవి. అలాగని ఆయా పరికరాలలో ఉండే సమస్త సూక్ష్మ పరికరాలు, కాంపోనెంట్లు ఇక్కడివేనని అనుకోరాదు. అనేక కారణాల వల్ల అన్నీ మనం తయారు చేసుకోలేకపోతు న్నాం. అయితే ముందు చూపుతో రక్షణ విభాగానికి చె ందిన ఎలక్ట్రానిక్ పరిక రాల రూపకల్పన, ఉత్పత్తుల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ స్థాపించుకున్నాం. అప్పటికే మొదలైన విమానాల ఉత్పత్తి సంస్థను హిందుస్థాన్ ఎయిరోనా టిక్స్గా మలచుకొని యుద్ధ విమానాల తయారీలో ముందంజ వేశాం. క్షిపణి రంగంలో భారత్ డైనమిక్స్, భారీ మిలటరీ వాహనాల కోసం భారత్ ఎర్త్ మూవర్స్, యుద్ధ నౌకల కోసం షిప్‌యార్డులు - ఇవన్నీ 40 ఏళ్ల క్రితమే మనుగడలోకి వచ్చాయి. ప్రగతిని సాధిస్తున్నాయి. ఇవేవీ యాభై దశకంలో తెలియనివే. రాడార్లు కూడా అంతే. ఇప్పుడు వీటిని కూడా మనమే రూపకల్పన చేసుకుంటున్నాం. రాత్రివేళలో శత్రువుల ఉనికిని పసిగట్టే నైట్‌విజన్ పరికరాలను వేల సంఖ్యలో నిర్మించుకుంటున్నాం.
మరి ఎందుకీ విమర్మలూ, భయం? రెండు మూడు కారణాలు. అగ్ర రాజ్యం సరసన గాక వెనుక నిలబడి ఉండడం ఒకటి. ఆ వెనుకబడడాన్ని మనం మహా ఉపద్రవంలా పరిగణించటం రెండోది. సూక్ష్మ పరికరాలు, కాంపోనెంట్ల దిగుమతిని స్వావలంబనతో ముడిపెట్టి, మన రాడార్లు, నెట్ వర్కుల్లో అధిక శాతం విదేశీ వస్తువులున్నప్పుడు వాటిని మనవే అని ఎలా అనగలం? అన్న అమాయకపు గడుసు ప్రశ్న ఒక కారణం. ఎల్లప్పుడూ గ్లాసును సగం ఖాళీగా చూచే వారి మనస్తత్వం మరో కారణం. మన దేశం కొంత యుద్ధ సామాగ్రికి టెండర్లు పిలిచి, ఒక టెండరును ఎంపిక చేస్తే, తమకు లభించలేదనే కక్షతో ఆమోదించిన టెండర్లో ఫలానా ఫలానా లొసుగులున్నాయని రక్షణ రంగం విషయాలు అంతగా తెలియని విలేకరు లను పట్టుకొని వారి ద్వారా దుష్పచారం చేయించడం జరుగుతోంది. లేదా లంచం తీసుకొని, ఆ టెండర్‌నే ఎంపిక చేశారా అనేది మరో కోణం. మన దేశం స్వావలంబన దిశగా ఎదగడాన్ని ‘అంగీకరించని’ దేశాలు చేసే ప్రచారం మరో కారణం. ఇలా ఎన్నో.
ఆశావహంగానే ఉండాలి
ఇక యుద్ధ విమానాలకు వద్దాం? మనం రూపకల్పన చేసినవి తక్కువ. విదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకొన్నవి ఎక్కువ. వాస్తవమే. కానీ, ఆయా సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, ఆయా విమానాల మరమ్మతు, ఓవర్‌హాల్ - అన్నీ సమస్యే. కానీ, ఓ కథ చెపుతారు. అప్పుడెప్పుడో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు వాళ్లకు మన విమానాల కన్నా మరింత సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన విమానాలున్నాయట. కానీ అవి కనుక మొరా యిస్తే మరమ్మతు చేసే శక్తి లేకపోవటం వల్ల యుద్ధరంగంలో అవి కర్ణుడి అస్త్రాలయ్యాయట. మనకా దుస్థితి లేదు, ఉండదు. మన సాంకేతిక సామ ర్థ్యం రెండు రకాలుగా చూడవచ్చు. విజయం, విఫలం. ఉదాహరణకు మనకు శత్రు విమానాల జాడ పసిగట్టగల రాడార్ల శ్రేణి సరిహద్దుల్లో మోహ రించి ఉంది. వాటి రూపకల్పన, ఉత్పత్తీ ఇక్కడివే.
విఫల వాదులంటారూ, ‘అబ్బే! అది ‘60లలో మొదలైన ప్రాజెక్టు. నత్తనడకన నడిచి యాభై ఏళ్ల తర్వాతే యుద్ధ రంగంలో మోహరించటం గొప్పేనా!’ అని. కానీ అదైనా ‘విజయమే’! సమయం సంగతి ఎలా వున్నా అలాంటి సామర్థ్యం ఉన్న రాడార్లు ఉన్న అతికొద్ది దేశాల్లో మనదీ ఒకటి.
మన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలోనే అలసత్వం, నిర్వ్యాపరత్వం, జవాబుదారీతనం లేకపోవటం, ఫలితాల పట్ల పట్టుదల లేకపోవటం, అంకితభావం లేకపోవటం ఉన్నాయి. ఇలాంటి చెట్టుకు కాసిన కాయలు సంపూర్ణ ఫలాలుగా ఉండాలని ఆశించటం సమంజసం కాదు. కానీ ఇదే రక్షణ విభాగపు ప్రయోగశాలల వ్యవస్థకు ఏపీజే అబ్దుల్‌కలాం లాంటి నాయకులు లభించినప్పుడు తాత్కాలికంగా అయినా, ప్రపంచ స్థాయి ఫలితాలు అందాయి. నాయకత్వం బలహీనమైనప్పుడు ప్రయోగశాలలు అనే ఏముంది, దేశమే నత్తనడక నడుస్తుంది. కానీ మనకున్న సాంకేతిక పరిజ్ఞానంలో సైతం జంకకుండా రాడార్లను మరమ్మతు చేసే అంకితభావం, విదేశీ డిజైనర్లను సైతం చకితులను చేసే పరికరాల రూపకల్పనా సామర్థ్యం ఉన్నాయి. ఇవి మన స్వంతం. అవి మన స్వావలంబనకు పునాదిరాళ్లు.
(జీవిత కాలం రక్షణ సంస్థలలో పని చేసి, దేశాభ్యుదయాన్నీ, స్వయం పోషకత్వాన్నీ వాంఛించిన ఒక మిత్రునితో చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా.)
(వ్యాసకర్త ఆర్థికాంశాల విశ్లేషకులు) - వి.హనుమంతరావు