పత్తాలేని సైబర్ ల్యాబ్స్
=న్వెస్టిగేషన్ ఎనాలసిస్కు ఉపయుక్తం
=డాదిన్నర క్రితమే సర్కారుకు ప్రతిపాదనలు
=పట్టించుకోని ఎంహెచ్ఏ, బీపీఆర్ అండ్ డీ
=ఫలితంగా ఇప్పటికీ ఆచరణలోకి రాని వైనం
సాక్షి, సిటీబ్యూరో: ఏ కేసు దర్యాప్తులో అయినా ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు కీలకపాత్ర పోషిస్తాయి. సాధారణ కేసుల్లో నమూనాలు సేకరించడం పోలీసులకు తెలిసిన విషయమే. అయితే సైబర్ నేరాల్లో మాత్రం అత్యంత సున్నితమైన టెక్నికల్ ఎవిడెన్స్‌కు కీలక ప్రాధాన్యం ఉంటుంది. వీటిని విశ్లేషించడం అంత తేలిక కాదు. చిన్న పొరపాటు జరిగినా... అవి తుడిచిపెట్టుకుపోతాయి. ఇది సైబర్ క్రిమినల్స్‌కు కలిసి రావచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు అనుబంధంగా వీటికి రూపమివ్వాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదనల్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు పంపారు. అయితే ఇప్పటికీ ఇవి అమలుకు నోచుకోలేదు.
ఆలస్యమైతే నిందితులకు లాభం...
ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు నమూనాలు వెళ్తే అక్కడ మౌలికవసతుల కొరత, పని ఒత్తిడి కారణంగా రిపోర్టు రావడానికి చాలా సమయం పడుతుంది. న్యాయస్థానాల్లో కేసులు నిలవాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అందించే నివేదికలు అత్యంత కీలకం. హత్య, లైంగికదాడి, చోరీ తదితర కేసుల్లో ఆధారాలుగా భౌతికాంశాలైన రక్తం, వేలిముద్రలు, ఆయుధాలు తదితరాలు ఉంటాయి. వీటిని సేకరించిన తరవాత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపే ముందు దర్యాప్తులో అవసరమైన మేర పోలీసులే విశ్లేషణ చేసుకుంటారు.
ఈ ఆధారాలు ఫిజికల్‌గా పోలీసుల వద్ద లేకున్నా దర్యాప్తు ముందుకు సాగుతుంది. అయితే, సైబర్ నేరాల్లో ఆధారాలుగా సెల్‌ఫోన్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల్లోని డేటా, పెన్‌డ్రైవ్స్, మెమోరీ కార్డ్స్ సేకరిస్తారు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాటిలోని సమాచారం తుడిచిపెట్టుకు పోయి నిందితులను దోషులుగా నిరూపించే అవకాశం లేకుండా పోతుంది. దీంతో టెక్నికల్ ఎవిడెన్స్‌గా పిలిచే వీటినీ విశ్లేషణ కోసం కచ్చితంగా ల్యాబ్‌కు పంపాల్సిందే. మరోపక్క సైబర్ క్రైమ్ సంబంధిత కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలంటే ఎప్పటికప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్లోని అంశాలను పరిగణలోకి తీసుకుని దశ, దిశలను మార్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూస్తే అది నిందితులకు అనువుగా మారే ప్రమాదం ఉంది.
దీనికి పరిష్కారంగానే...
నిందితులను పట్టుకోవడం, వీరిపై నమోదైన అభియోగాలను కోర్టులో నిరూపించడం కోసం సాంకేతిక ఆధారాలను విశ్లేషించాలని దర్యాప్తు అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాదు. సరైన అవగాహన, శిక్షణ, ఉపకరణాలు లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే సైబర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రాథమికంగా జంట కమిషనరేట్లలోని సైబర్ పీఎస్‌ల్లో రెండింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర పోలీసు విభాగం ఆ మేరకు రూ.3.8 కోట్ల అంచనాలతో గతేడాది ఏప్రిల్‌లో ఎంహెచ్ఏకు ప్రతిపాదనలు పంపింది. ఒక్కో ల్యాబ్‌ను రూ.1.9 కోట్లతో ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ ఎనాలసిస్కు ఉపకరించే ఈ తరహా ల్యాబ్ ప్రస్తుతం సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ అందుబాటులో ఉంది. అక్కడి నిపుణులతోనే ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే ల్యాబ్స్‌లో పని చేసే సిబ్బందికీ శిక్షణ ఇప్పించాలని భావించారు.
బీపీఆర్ అండ్ డీ కూడా మర్చిపోయింది...
సదరు నిధుల్ని అందించాల్సిందిగా చేరిన ప్రతిపాదనల్ని ఎమ్హెచ్ఏ పట్టించుకోలేదు. దీని విషయం ఇలా ఉంటే... మరో రెండు ల్యాబ్స్ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామంటూ ముందుకు వచ్చిన బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) కూడా ఆ విషయం మర్చిపోయి మిన్నకుండి పోయింది. తొలినాళ్లలో బీపీఆర్ అండ్ డీ అందించే నిధులతో విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఎమ్హెచ్ఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇవి మంజూరైతే జంట కమిషనరేట్లలోనే ఇవి పెట్టి, ఆ తరవాత వచ్చే నిధులతో ఇతర ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే రెండు విభాగాలు సైతం మిన్నకుండిపోవడంతో సైబర్ ల్యాబ్స్ పత్తాలేకుండా పోయాయి. రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతుండటంతో అమాయకుల డబ్బు ఆన్లైన్ ద్వారానే వారికి చేరిపోతోంది.