సింగూరు ఎడమ కాల్వకు నీరు
పుల్కల్/ జోగిపేట, న్యూస్‌లైన్: ‘సింగూరు’ ట్రయల్ రన్‌ను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించారు. పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా మెయిన్ కాల్వలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన ఎడమ కాల్వ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడమ కాల్వకు ఉన్న రెండు గేట్లను ఎత్తారు. అక్కడి నుంచి కాల్వ వెంట సుమారు మూడు కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. అనంతరం ముద్దాయిపేట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాటి 102 రోజుల దీక్ష ఫలితం, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ నేడు నెరవేరిందని అన్నారు.
ఎనిమిది చెరువుల్లోకి నీరు
ఎడమ కాల్వ ద్వారా వదిలిన 0.15 టీఎంసీల నీరు పుల్కల్ మండలంలో ఐదు చెరువులకు, అందోల్ మండలంలో మూడు చెరువులకు వెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీరు చెరువుల్లోకి చేరితే సుమారు 7,550 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. సింగూరు ఎడమ కాల్వ నుంచి వదిలిన నీరు మొదట అందోల్ పెద్ద చెరువులోకి వెళ్లనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, ఆర్డీఓ వనజాదేవి, జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, జగన్మోహన్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లప్ప, డీసీసీబీ డెరైక్టర్ రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు దుర్గారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు.