పెద్దల పాడు పనులు!
సమాజంలో బాధ్యయుత స్థానాల్లో ఉన్నవారు హుందాగా మెలగాలి. మరీ ముఖ్యంగా గౌరవ ప్రదమైన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మరింత హుందాగా నడుకోవాల్సివుంటుంది. తమ కింద పనిచేసే వారి పట్ల మర్యాదగా వ్యహరించాల్సిన పెద్దలు దారి తప్పుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఉన్నత స్థానాల్లో వ్యక్తులు స్త్రీల పట్ల చులకగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు అధికమడం సాధారణంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన తరుణ్ తేజ్పాల్, జస్టిస్ ఏకే గంగూలీ వివాదాలే ఇందుకు ఉదాహరణ.
సంచలనాత్మక ‘స్టింగ్’ ఆపరేషన్లతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రిక ఇప్పుడు కష్టాల్లో పడింది. దానికి కారణం ఆ ప్రతిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్. అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా పేరు గాంచిన తేజ్పాల్ తన కూతురి స్నేహితురాలిపై వికృతచేష్టలతో జైలుపాలయ్యారు. ‘స్టింగ్’ జర్నలిజానికి చిరునామాగా మారిన తేజ్పాల్ దారి తప్పి ఊచలు లెక్కిస్తున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరోను కలుద్దామని ఆశ పెట్టి గోవా స్టార్ హోటల్లో బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారన్న ఆరోపణలతో తేజ్పాల్ ఆట కట్టించారు.
పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్న జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా పనిచేసి రిటైరైన గంగూలీపై న్యాయవిద్యార్థిని ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. నిర్భయ ఉదంతంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో తన పట్ల జడ్జిగారు అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు వెల్లడించడంలో కలకలం రేగింది.
న్యూఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్లోని గదిలో జస్టిస్ గంగూలీ గత ఏడాది డిసెంబర్ 24న రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల మధ్య తనను వేధించారని తెలిపింది. మద్యం తాగాలని కోరారని, కామపేక్షతో కనబరచారని బాధితురాలు వాపోయింది. అయితే తాను వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గారని చెప్పింది. తాను బయటకు వెళ్లిన తర్వాత తన వెనకకే వచ్చి లోపల జరిగిన దానికి సారీ కూడా చెప్పారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతంపై ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ కూడా దీన్ని నిర్ధారించింది. అయితే ఘటన జరిగిన నాటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గంగూలీ రిటైరైనందున ఆయనపై తదుపరి చర్యలు తీసుకోబోమని తెలిపింది.
మహిళా భద్రత ప్రశ్నార్థకమైన తరుణంలో ఉన్నత స్థానాల్లో వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తమను ఏమీ చేయరన్న దీమాతో లేదా బాధితులు ఎవరికీ చెప్పుకోలేరన్న ధైర్యంతో 'పెద్దోళ్లు' పాడు పనులకు దిగుతున్నారు. వయసుపైబడిన వారు తమ కూతురి వయసున్న యువతులపై అకృత్యాలకు తెగబడుతుండడం ప్రమాదకర పరిణామం. తరుణ్ తేజ్పాల్(50), ఏకే గంగూలీ(66) ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారే కాదు వయసులోనే పెద్దవారే కావడం గమనార్హం. వికృత చేష్టలతో తమ పెద్దరికానికే కాదు, తమ పదవులకు కళంకం తెచ్చారు. చేసిన పనులకు సిగ్గుపడడం పోయి సమర్థించుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. మహిళ భద్రతకు ఢోకా లేని సమాజంగా అవతరించాలంటే తక్షణ సామాజిక విలువల సంస్కరణ జరగాలి.