తిలక్ నామినేషన్‌కు ఉప్పొంగిన జనతరంగం
సాక్షి, టెక్కలి/టెక్కలి రూరల్: నేల తల్లి ఈనేలా.. నింగి ఒంగి చూసేలా.. ప్రత్యర్థుల గుండెలు అదిరేలా.. ఇన్నాళ్లు అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు విసిగిన ప్రజలంతా ఒక్కసారిగా జై జగన్.. జైజై తిలక్ అంటూ మిన్నంటిన నినాదాలతో జనతరంగం ఉప్పొంగింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ గురువారం చేపట్టిన నామినేషన్ కార్యక్రమానికి టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల నుంచి ఊరు.. వాడా కదిలింది. నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి రావడంతో పట్టణం నలుమూలలు కిక్కిరిసిపోయాయి. ముందుగా తిలక్ స్థానిక మెళియాపుట్టి రోడ్ జంక్షన్‌కు చేరుకోగానే ప్రజలంతా డప్పు వాయిద్యాలతో పూల దండలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలతో చేరీవీధిలోని కిల్లి పోలమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. పేరాడ, ఆయన భార్య భార్గవితో పాటు పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
వైఎస్సార్ సీపీ శ్రేణుల జోష్
కిల్లి పోలమ్మతల్లి ఆలయం నుంచి టెక్కలి మెయిన్ రోడ్ మీదుగా అశేష ప్రజానీకం నడుమ వారి ఆశీస్సులు అందుకుంటూ తిలక్ ర్యాలీ ముందుకు సాగింది. జై జగన్.. జైజై తిలక్.. జైజై దువ్వాడ అంటూ దారి పొడవునా నినాదాలు మిన్నంటాయి. డప్పు వాయిద్యాలతో, డీజే శబ్ధాలతో కొనసాగిన ర్యాలీలో కార్యకర్తలు, ప్రజలు డ్యాన్సులు చేస్తూ హోరెత్తించారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి తిలక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించి, నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి యర్ర చక్రవర్తి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, యువజన అధ్యక్షుడు పి.రాజేంద్ర, నందిగాం జెడ్పీటీసీ సభ్యుడు కె.బాలకృష్ణ, పలాస జెడ్పీటీసీ సభ్యురాలు పి.భార్గవి, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు బలగ ప్రకాశ్, కె.జగన్నాయుకులు, నాయకులు రొక్కం అచ్యుతరావు దొర, బోయిన నాగేశ్వర్రావు, టి.జానకీరామయ్య, గురునాథ్ యాదవ్, దువ్వాడ వాణి, సింగుపురం మోహనరావు, ఎన్.శ్రీరామ్ముర్తి, కె.సతీష్, బి.హరి, టి.కిరణ్, చిన్ని జోగారావు, కె.నారాయణమూర్తి, చింతాడ గణపతి, ఎస్.ఉషారాణి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏరా.. పోరా.. నాయకుడు అవసరమా?
‘ఏరా.. మీరు నాకేమైనా ఓటు వేశారా? మీకెందుకు నేను పనిచేయాలి’ అంటూ ప్రజలపై విరుచుకుపడే అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు మనకు అవసరమా? అని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. తిలక్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి అంబేడ్కర్ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజలను, అధికారులను ఏరా.. పోరా అంటూ తిట్టే అచ్చెన్న లాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు.
అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో సంక్షేమ పథకాల్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, జిల్లాలో ఇసుక మాఫీయాకు అచ్చెన్నాయుడే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఇటువంటి అవినీతి పాలనకు చరమగీతం పాడాలని దువ్వాడ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడుతూ... వైఎస్ జగన్ అంటే కార్యదీక్ష అని అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె కోరారు.
ప్రజలను రోడ్డున పడేశారు..
అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ... రోడ్డు విస్తరణ పేరుతో కోట్లాది రూపాయలు కాజేసిన అచ్చెన్నాయుడు పేద ప్రజలను నడిరోడ్డున పడేశారని గుర్తుచేశారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మినీస్టేడియం, 100 పడకల ఆస్పత్రి, మహిళా కళాశాల, హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా టీడీపీ నాయకులకు లాభం చేకూర్చే పనులపైనే దృష్టి పెట్టారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా ఉండాలంటే యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని తిలక్ కోరారు.