తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్‌షాపులు మూసేస్తాం
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన స్త్రీశక్తి ఉపాధిహామీ భవనాన్ని శనివారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పదవులపై ఆశలేదని, ప్రజాసేవే ముఖ్యమన్నారు. మంత్రి పదవిలో ఉండి ఉంటే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే శ్రీశైలం సొరంగ మార్గం చేపట్టినట్లు వివరించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మూడవ విడత రచ్చబండలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. మ ద్యానికి అలవాటు పడి ఎంతో మంది చనిపోతున్నారని, మద్యం మానిపించేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే మహిళలకు ఆర్థిక స్వాలంభన లభించిందన్నారు. మహానేత చేపట్టిన మహిళా సంక్షేమ పథకాలు గర్వించదగినవన్నారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన రుణాలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకనారాయణగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, ఉద్యానవనశాఖ ఏడీ బి.బాబు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ పాల్గొన్నారు.