తెలంగాణ వ్యవసాయ వర్సిటీకి సొంత చట్టం
ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సొంత చట్టం ఏర్పాటైందని ఆయూనివర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక వైస్ చాన్స్‌లర్‌ను నియమించడమే మిగిలివుందన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు కూడా లభించిందన్నారు. అవార్డులు, డిగ్రీలు ప్రదానం చేసుకునే అధికారం కలగడంతో పాటు, ఐసీఆర్లోనూ చోటు లభించిందన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వ్యవసాయ సీట్లలో 15 శాతం అనగా 40 సీట్లు తెలంగాణకు దక్కుతాయన్నారు.
ఐసీఆర్లోని మొత్తం 29 స్కీంలకు సంబంధించి ఎంవోయూలు పంపినట్లు ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘంలోనూ వర్సిటీకి సభ్యత్వం లభించిందన్నారు. విభజన తర్వాత సీట్లు పెంచాల్సిన అవసరముందని...ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. రూ. 2 కోట్లతో కాలేజీ, హాస్టళ్లను ఆధునీకరిస్తున్నామన్నారు. విభజన తర్వాత 2001 జనాభా ప్రకారం తెలంగాణకు 36 శాతం మాత్రమే సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 52:48 నిష్పత్తిలో జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేకరుల సమావేశంలో డి.రాజిరెడ్డి, అనురాగ్ చతుర్వేది, టీవీకే సింగ్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.