telangana amaraveerulu
-
అమర వీరుల కుటుంబాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రానున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ పార్టీలో కూడా చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ మాట్లాడుతూ.. సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్కు రెండే రాజ్యసభ స్థానాలు వస్తాయని, ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మూడోది గెలవాలి కనుక తమ ఆలోచనకు అనుగుణంగా అమరవీరుల కుటుంబాలకు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. తన బంధువు సంతోష్‌ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ యోచిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లే అర్హత సంతోష్‌కు ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు సపర్యలు చేయడమే సంతోష్ అర్హతా? అని ఎద్దేవా చేశారు. అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపుతామని రేవంత్ హెచ్చరించారు. -
తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది ?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన చంద్రబాబు...తెలంగాణ అమర వీరులు గురించి మాట్లాడడం సిగ్గూచేటుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో తప్పించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే అధిక సీట్లు గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ హారీష్ రావు ఈ సందర్బంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నికలో గెలవలేక బీజేపీతో పొత్తు కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు మోకరిల్లారని చంద్రబాబుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకునేందుకు క్యాడర్ భయపడుతోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే ఆయన్ని పట్టించుకునే నాథుడు కూడా ఉండేవాడు కాదంటూ విమర్శించారు.