బంజారాహిల్స్ లక్ష్మీనరసింహస్వామికి స్వర్ణ దేవాలయం
హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్టు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్, ఇస్కా న్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిట్ దాస చెప్పారు. 4.38 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో ఈ ఆలయం నిర్మాణ బాధ్యతలను హరే కృష్ణా మూవ్మెంట్ చేపట్టింది. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో స్వర్ణ దేవాలయ నమూనాను మధు పండిట్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘ఈ ఆలయం నగరంలో ఓ చారిత్రక కట్టడంగా నిలిచిపోతుంది. ఇది పూర్తయితే ఆధ్యాత్మిక పర్యాటకం కింద వారానికి లక్ష మంది వస్తారు. ఇందులో మల్టీపర్పస్ ఆటోమేటిక్ బ్లాక్, చారిటీ కల్యాణమండపం, నిత్యాన్నదానం, మెడిటేషన్, యోగ, గ్రంథాలయం, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రమోషన్ బ్లాక్ నిర్మిస్తాం. త్వరలోనే మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తాం. ఆరు నెలల్లో గర్భాలయ ప్రాకారాలు పూర్తి చేసి దర్శనం కల్పిస్తాం. ఏడాదిలో మొత్తం నిర్మాణం పూర్తవుతుంది’ అన్నారు. అలాగే మధుర సమీపంలో ని బృందావనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం నిర్మిస్తున్నామన్నారు.
మెదక్ జిల్లాలో శాశ్వత కిచెన్...
మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద రూ.25 కోట్లతో పర్మినెంట్ కిచెన్ సెంటర్ నిర్మిస్తున్నట్టు దాస చెప్పారు. నాలుగు ఎకరాల్లో నిర్మించేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. ప్రస్తుతం పటాన్చెరు వద్ద ఉన్న కిచెన్ సెంటర్ సరిపోవటం లేదన్నారు. ఏడాదిన్నరలో దీన్ని పూర్తిచేసి అక్కడి నుంచే అన్ని ప్రాంతాలకూ ఆహారం సరఫరా చేస్తామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ- ఏపీ రాష్ట్రాల యూనిట్, హరే కృష్ణా మూవ్మెంట్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస, బిందు మాధవ దాస, రవి లోచన దాస, యజ్ఞేశ్య దాస పాల్గొన్నారు.