'హైదరాబాద్ విలీనం ఆత్మగౌరవదినం'
హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ విలీనదినాన్ని తెలంగాణ ఆత్మగౌరవ దినంగా పాటించాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం తీర్మానించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్నీతితో ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ భాస్కర్ మండిపడ్డారు. సీమాంధ్రలో మానవ హక్కుల హననం జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రెండో దశలో ఉందని హైకమాండ్ ఇప్పటికే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యంగానే ఉంటుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 1972 నాటి జై ఆంధ్రా స్ఫూర్తితో స్పందించాలనుకునేవారిని ప్రభుత్వం ఆటంకం పరుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణవాదులను రెచ్చగొడితే వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానికి అంగీకరించిన తెలంగాణవాదుల ఔదార్యాన్ని సీమాంధ్రులు గౌరవించాలన్నారు. దుందుడుకు చర్యలు, ఒత్తిడి రాజకీయాలు సీమాంధ్ర నేతలు మానుకోవాలని సలహా ఇచ్చారు. లేకుంటే మద్రాసు నుంచి ఆంధ్రానేతలను తరిమిన పరిస్థితులు హైదరాబాద్‌లోనూ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.