కవిత రాకతో కార్మికులకు న్యాయం
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు గౌరవాధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కవితను నియమించడంతో కార్మికులకు మేలు జరుగుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కవిత నియామకంతో కార్మికుల సుధీర్ఘకాలమైన డిపెండెంట్ ఉద్యోగాలు, ఇతర కీలక సమస్యలు కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పదమూడేళ్లుగా కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేయగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణను ప్రకటించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ధూంధాం నిర ్వహించనున్నట్లు చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, కౌన్సిలర్లు జగన్మోహన్రావు, షఫీ, శ్రీపతి శ్రీనివాస్, నాయకులు బోరిగాం రాజారాం, కొత్త జయప్రకాశ్ పాల్గొన్నారు.