రుణ ఎగవేత జాబితాలో 904 కంపెనీలు
♦ విల్‌ఫుల్ డిఫాల్లర్లుగా ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
♦ వీటి మొత్తం బకాయిల విలువ దాదాపు రూ. 11 వేల కోట్లు
♦ లిస్టులో విన్సమ్ డైమండ్స్, జూమ్ డెవలపర్ తదితర సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)... భారీ మొండిబకాయిల చిట్టాను ప్రకటించింది. తమ బ్యాంకులో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) కంపెనీలు 904 ఉన్నాయని వెల్లడించింది. ఈ మొత్తం సంస్థల రుణ బకాయిల విలువ గతేడాది డిసెంబర్ చివరినాటికి రూ.10,870 కోట్లుగా పీఎన్బీ పేర్కొంది. జాబితాలో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ, జూమ్ డెవలపర్స్, నాఫెడ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా, ఇటీవలే విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను కూడా పీఎన్బీ విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రూ.1,500 కోట్ల మేర పీఎన్బీకి బకాయిపడింది. కాగా, బ్యాంకుల్లో రూ. 500 కోట్లకు మించి రుణాలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన ఎగవేతదారుల(కంపెనీలు) జాబితాను 9 వారాల్లోగా సీల్డు కవర్లో సమర్పించాలంటూ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)ను ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పీఎన్‌బీఐ తాజా చర్యలు వెలువడటం గమనార్హం.
అతిపెద్ద బకాయిదారు విన్సమ్ డైమండ్స్...
పీఎన్బీ తాజా జాబితా ప్రకారం... 904 విల్‌ఫుల్ డిఫాల్టర్లలో విన్సమ్ డైమండ్స్ అతిపెద్ద బకాయిదారుగా ఉంది. ఈ కంపెనీ బకాయిపడ్డ మొత్తం రుణం విలువ రూ.900.37 కోట్లు. ఇతర ప్రధాన డిఫాల్టర్లలో ఫరెవర్ ప్రెసియస్ జ్యువెలరీ అండ్ డైమండ్స్(బకాయి విలువ రూ.748 కోట్లు), జూమ్ డెవలపర్స్(రూ. 410 కోట్లు), నాఫెడ్(రూ.224.26 కోట్లు), ఎస్ కుమార్ నేషన్వైడ్(రూ.146.82 కోట్లు) ఉన్నాయి.
బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకునే(మొండిబకాయిలను తగ్గించుకోవడం) ప్రక్రియలో భాగంగా దాదాపు రూ.3,000 కోట్ల ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)లకు విక్రయించే ప్రణాళికల్లో పీఎన్బీ ఉంది. గడచిన ఆరేళ్లలో తాము ఏఆర్సీలకు ఎలాంటి మొండిబకాయిలనూ విక్రయించలేదని పీఎన్బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ పేర్కొన్నారు. మరోపక్క, బకాయిల రికవరీ కోసం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా మొండిబకాయిల తగ్గింపు చర్యల్లో భాగంగా వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రతిపాదనలతో పాటు ఇతర చర్యలపైనా బ్యాంకు దృష్టిపెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో పీఎన్బీ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) ఏకంగా 8.47 శాతానికి(రూ.34,338 కోట్లు), నికర ఎన్పీఏలు 5.86 శాతానికి(రూ.22,983 కోట్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో డిఫాల్టర్స్