'రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి డోఖా లేదని ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని వస్తున్న వార్తలు కేవలం కట్టుకథలే అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో గుజరాత్ ఉంటే ఆ తర్వాత స్థానం తెలంగాణదే అని ఈటల రాజేందర్ వెల్లడించారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి భేష్‌గా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిందన్న విషయాన్ని మంత్రి ఈటల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆదాయ పన్ను శాఖ ఒకేసారి రూ. 1250 కోట్లను జమ చేసుకోవడం కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. ఆ నగదు వెనక్కి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కేంద్రంలో సంప్రదిస్తున్నామని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దాంతో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం పైవిధంగా స్పందించారు.