తొలి అమాత్యులు
- మన జిల్లాకు రెండు మంత్రి పదవులు
- ఈటెలకు ఆర్థిక శాఖ, పౌరసరఫరాలు
- కేటీఆర్‌కు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందరూ ఊహించిన విధంగానే కేసీఆర్ కేబినేట్లో ఈటెల రాజేందర్‌తో పాటు కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకు చోటు దొరికింది. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన కొలువు దీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినేట్ మంత్రులుగా తమ బాధ్యతలు స్వీకరించారు. శాఖల కేటాయింపులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు పెద్దపీట వేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు ఆర్థికశాఖతోపాటు పౌర సరఫరాలు, ప్లానింగ్, చిన్న మొత్తాలు, తూనికలు, కొలతల శాఖలు అప్పగించారు. వరుస గా అయిదుసార్లు ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించిన ఈటెల ఉద్యమంలోనూ క్రియాశీలపాత్ర పోషించారు. గత ప్రభుత్వ హయాంలోనూ టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా అందరి దృష్టిని ఆకర్షించారు. వరుసగా మూడుసార్లు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి న యువ నేత కేటీఆర్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు. చిన్న వయసులో నే మంత్రి పదవిని పొందిన కేటీఆర్ అటు సీఎం తనయుడిగా.. ఇటు ఉద్యమ నేతగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గడిచిన అరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నుంచి మొత్తం 16 మంది నేతలు రాష్ట్రంలో మంత్రి పదవులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అమాత్య పదవులను అందుకున్న రికార్డు ఈటె ల, కేటీఆర్‌లు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లా నుంచి మంత్రులైన వారి సంఖ్య 18కి చేరింది. గత ప్రభు త్వ హయాంలో శ్రీధర్‌బాబు పౌరసరఫరాల శాఖను నిర్వహించారు. ప్రస్తుతం ఈటెలకు ఆ శాఖ అప్పగించటంతో వరుసగా రెండోసారి పౌరసరఫరాల శాఖ సారథ్యం మన జిల్లాకే దక్కింది. గతంలో వైఎస్ హయాంలో జీవన్‌రెడ్డి, జువ్వాడి రత్నాకర్‌రావు ఏకకాలంలో జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారు. అదే తీరుగా జోడు మంత్రి పదవుల అవకాశం మళ్లీ వచ్చినట్లయింది.
హరీశూ మన జిల్లావాడే..
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిగా నియమితుడైన తన్నీరు హరీశ్‌రావు మనవాడే. బెజ్జెంకి మండలం తోటపల్లి ఆయన స్వగ్రామం. ఆయన విద్యాభ్యాసమంతా కరీంనగర్‌లోనే సాగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత హరీశ్‌రావు కేసీఆర్ వెంట హైదరాబాద్‌కు మకాం మార్చారు. కేసీఆర్ రాజీ నామాతో ఖాళీ ఏర్పడడంతో సిద్దిపేట నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయిదుసార్లు గెలిచిన రికార్డు నమోదు చేసుకున్నారు. సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా జిల్లా తో అనుబంధాన్ని కొనసాగించారు. ఆయన కుటుంబీకులు ఇప్పటికీ జిల్లాలోనే ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆయన పుట్టి, పెరిగింది, రాజకీయ అరంగేట్రం చేసింది కరీంనగర్ జిల్లానే కావడంతో జిల్లా నుంచి ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించినట్లయింది.
కొప్పులకు ఛాన్స్ మిస్
కేసీఆర్ తొలి దఫా మంత్రివర్గంలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు చోటు దొరక్కపోవటం చర్చనీయాం శంగా మారింది. దళిత నాయకుడు కావటంతో బెర్త్ ఖాయమని ముందునుంచీ ప్రచారం జరిగింది. డెప్యూటీ సీఎం రేసులో డాక్టర్రాజయ్యతోపాటు ఆయన పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తీరా.. కేసీఆర్‌తో ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల జాబితాలో ఆయన లేకపోవటంతో ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. తదుపరి మంత్రివర్గ విస్తరణలో కొప్పులకు చోటు దొరుకుతుందని.. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ లేదా డెప్యూటీ స్పీకర్ పదవుల నియామకంలో ఆయనకు అవకాశం కల్పిస్తారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.