పోలీసులనే కొట్టారు.. మాపై దాడి చేయరా..?
- యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రాణ భయం
- ‘మస్తీ శిక్షణ కేంద్రం’లో తెలంగాణ విద్యార్థినుల ఆవేదన
- యాజమాన్యంతో సీఐ సంప్రదింపులు..
- విద్యార్థినులు శంషాబాద్‌లోని శిక్షణ కేంద్రానికి తరలింపు
యాచారం: రక్షణ కల్పించలేని శిక్షణ సంస్థ యాజమాన్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, నాగాలాండ్, మిజోరం తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు పోలీసులనే రాళ్లతో కొట్టారు.. మమ్మల్ని కొట్టరని గ్యారంటీ ఏంటని ఆదివారం తెలంగాణ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. శనివారం మండల కేంద్రంలో ఉన్న ‘మస్తీ హెల్త్ అండ్ బ్యూటీ ప్రైవేట్ లిమిటెడ్’ శిక్షణ కేంద్రంలో తెలంగాణ విద్యార్థినులపై నాగాలాండ్‌తో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు దాడి చేసిన విషయం తెలిసిందే. గాయపడిన తెలంగాణ విద్యార్థినులు ప్రాణభయంతో శిక్షణ కేంద్రంలో ఉండలేమని స్పష్టం చేయడంతో వారిని అదే రాత్రి బీసీ బాలికల వసతి గృహంలో బస కల్పించారు.
బ్యూటీ, ఐటీ రంగాల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందుతామనే ఆశతో పలు జిల్లాల నుంచి ఇక్కడికి వస్తే యజమాన్యం తమకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆదివారం ఉదయం తెలంగాణ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. స్వరాష్ట్రంలో తమపైనే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు దాడికి దిగుతారా..? తమకు న్యాయం చేయారా..? అంటూ ఆందోళనకు దిగారు. సీఐ మదన్‌మోహన్‌రెడ్డి, ఎస్ఐ నర్సింహ పలుమార్లు విద్యార్థినులతో మాట్లాడి శాంతింపజేశారు. సీఐ యజమాన్యంతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలుగా విద్యార్థినుల మధ్య ఘర్షణ జరుగుతుంటే స్పందించరా..? అని మండిపడ్డారు. పరిస్థితిపై సీఐ ఏసీపీ నారాయణగౌడ్‌తో పాటు స్థానిక తహసీల్దార్ వసంతకుమారి సమాచారమిచ్చారు. చివరకు యజమాన్యం రావడంతో విద్యార్థినులతో చర్చలు జరిపారు.
మస్తీ హెల్త్ సెంటర్లో తమకు వసతి కల్పించి నాగాలాండ్, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు బయట వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సెంటర్‌నే మూసేయండి అంటూ మండిపడ్డారు. శంషాబాద్‌లో ఉన్న కేంద్రంలో పూర్తిగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు శాంతించారు. యజమాన్యం ప్రైవేట్ వాహనాల్లో 80 తెలంగాణ విద్యార్థినులను అక్కడికి తరలించారు. ఆదివారం ఉదయం తెలంగాణ విద్యార్థినులకు బీజేవైఎం, సీపీఎం నాయకులు మద్దతు పలికారు.
కేసు నమోదు..
ఘర్షణకు కారణమైన ఫ్యాకల్టీలోని ఓ మహిళతో పాటు నాగాలాండ్, ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.