పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షలు, సిలబస్‌పై త్వరలోనే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సిన తీరుపై క్షుణ్నంగా వివరిస్తామన్నారు.
సోమవారం టీఎస్పీఎస్సీ సిలబస్ ప్రకటన అనంతరం సంఘం ప్రతినిధులు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని, కమిషన్ సభ్యులను కలసి నిరుద్యోగ అభ్యర్థుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగానే సిలబస్ ప్రకటించడం వల్ల అభ్యర్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. అభ్యర్థులు కోచింగ్లపైనే ఆధారపడకుండా.. సిలబస్‌కు అనుగుణమైన ప్రామాణిక గ్రంథాలు, ఆర్టికల్స్ చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.