'బాబుకే చివరి రోజు... తెలంగాణ సర్కార్‌కు కాదు'
హైదరాబాద్: తనను అరెస్ట్ చేస్తే... తెలంగాణ సర్కార్‌కు అదే అఖరిరోజు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజముందని జాపల్లి తెలిపారు. కాకపోతే ఆయన అరెస్ట్‌తో ఆయనకే చివరి రోజుని... అంతేకాని తెలంగాణ సర్కార్‌కు కాదని జూపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తున్న యాగీతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్న వారంతా ప్రశాంతంగా ఉన్నారని వెల్లడించారు. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రపంచస్థాయిలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఉంటుందని జూపల్లి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఎల్లుండి పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలు, సీఈఓలు మధ్య తెలంగాణ పారిశ్రామిక విధానం వెల్లడిస్తామని జూపల్లి తెలిపారు. పారిశ్రామిక అనుమతులన్నీ సింగిల్ విండో విధానంతో నిర్దేశిత గడువులో అందిస్తామని జూపల్లి వెల్లడించారు.