దరఖాస్తు చేస్తే చాలు బ్యాంకు రుణం..
రాష్ట్ర స్థాయిలో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్
కంపెనీల ప్రతిపాదనకు ప్రభుత్వ హామీ
2015-16లో ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు
తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాల కోసం పారిశ్రామికవేత్తలు ఇక బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుకై రుణం కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేస్తే చాలు.. రుణం మంజూరయ్యేలా రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ రూపుదిద్దుకుంటోంది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టిందని తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ శుక్రవారం తెలిపారు.
పరిశ్రమను స్థాపించేందుకై బ్యాంకులకు వచ్చే ప్రతి దరఖాస్తుకు (ఉత్తమ ప్రతిపాదన) ప్రభుత్వం నుంచి హామీ ఉంటుందన్నారు. ‘బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వానిదే బాధ్యత. నిధులు పక్కదారి పట్టకుండా చూస్తాం. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. కంపెనీ రుణం తీర్చలేకపోతే ఈ ఫండ్ నుంచి బ్యాంకుకు చెల్లిస్తాం’ అని అన్నారు. నిధుల మంజూరుకు బ్యాంకులకు నిర్ణీత గడువు విధిస్తామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ఎంఎస్ఎంఈలకు నిధులు అన్న అంశంపై అసోచాం, ఫ్యాప్సీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు.
ఖాయిలా పడకుండా..
ఖాయిలా దిశగా వెళ్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ ఫండ్ ఒకదానిని 2015-16 బడ్జెట్లో అమలు చేయనున్నట్టు జయేష్ రంజన్ తెలిపారు. ‘ఫండ్కై కంపెనీల నుంచి ప్రీమియం వసూలు చేస్తాం. ప్రభుత్వం కూడా అవసరమైనన్ని నిధులు సమకూరుస్తుంది. బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాకు కంపెనీకి గడువు ఇస్తాం. అవక తవకలకు పాల్పడితే కంపెనీని సీజ్ చేస్తాం’ అని వెల్లడించారు. ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
స్థానిక ఎంఎస్ఎంఈలకు భారీ పరిశ్రమల తోడ్పాటు తప్పనిసరి అన్నారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. రుణ దరఖాస్తులు ఎలా సిద్ధం చేయాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఫండింగ్ ఒక్కటే చాలదని, సమయానుకూలంగా వ్యాపారాన్ని మల్చుకోవాల్సిందేనని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా అన్నారు. 50 శాతం స్టార్టప్‌లు ఏడాది తిరక్కముందే కనుమరుగు అవుతున్నాయి. 27 శాతం స్టార్టప్‌లు మూడేళ్లు కూడా నిలదొక్కుకోవడం లేదని రిసర్జెంట్ ఇండియా సీనియర్ మేనేజర్ వి.శంకరనారాయణన్ తెలిపారు.