'పోలవరంపై రాజ్యసభలో ఓటింగ్‌కు పట్టుబడతాం'
లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు అప్రజాస్వామికంగా ఆమోదించారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం అధికార బలంతో తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తూ ఆర్డినెన్స్‌కు చట్టబద్దత కల్పించారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించిన తీరుపై నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి... రాజ్యసభలో ఆ బిల్లును వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు.
పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కోసం పట్టుబడతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు తెలంగాణ ప్రజల వైపు ఉండాలనుకుంటున్నారో లేక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తొత్తులుగా ఉండదలచుకున్నారో తేల్చుకోవాలని కేటీఆర్ పచ్చ తమ్ముళ్లకు సవాల్ విసిరారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని... ఆ క్రమంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు.
తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీడీపీ నేతలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని... ఆ ప్రాజెక్టు డిజైన్ మాత్రమే మార్చాలని మాత్రమే తాము కోరుతున్నామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌పై నీ పెత్తనం ఏంటని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఓ అతిథిగాలాగానే ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.