ఇంటికొక ఉద్యోగం ఎక్కడ వచ్చింది?
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం ఎక్కడ వచ్చిందో చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 1,600 గ్రూప్–1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడంలేదని విమర్శించారు. అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారన్నారు. భూకబ్జాదారులు, దొంగలు, చదవులేని వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ కోలా జనార్దన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సింహాద్రి, అంజి, ఆనందం, చాంద్‌పాషా, శ్రీనివాస్, గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు.