200 మందికిపైగా మూకుమ్మడి సెలవులు?
హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు ఆందోళన మరింత ఉధృతం దాల్చుతోంది. న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ న్యాయాధికారులు మరోసారి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. మరోవైపు సహచర న్యాయాధికారులు, సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్ చేయడంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో 15 రోజులపాటు సామూహిక సెలవులు పెట్టాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్కు గురైన జడ్జిలపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 200 మంది న్యాయాధికారులు మూకుమ్మడిగా సెలవులపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒకవైపు న్యాయవాదుల ఆందోళనలు, మరోవైపు కోర్టు సిబ్బంది పెన్డౌన్తో సహాయ నిరాకరణ కార్యక్రమాలు, మరోవైపు న్యాయాధికారుల సామూహిక సెలవుతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరో 15 రోజులపాటు న్యాయాధికారులు సామూహికంగా సెలవులో వెళ్లాలని నిర్ణయం తీసుకోవటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
జూలై 1 నుంచి న్యాయశాఖఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. దీంతో న్యాయస్థానాల తాళాలు తెరిచే పరిస్థితి కూడా ఉండదు. మూగబోయిన కోర్టులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు మూగబోయాయి. న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో న్యాయవ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయింది. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఈ 22 రోజుల్లో దాదాపుగా కేసులు విచారణకు నోచుకోలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వినియోగదారుల ఫోరమ్స్, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సహా ఇతర క్వాజీజ్యుడీషియల్ సంస్థలు పనిచేయడం లేదు. దాదాపు 10 రోజులపాటు కొన్ని బెయిల్ పిటిషన్లు కూడా విచారణకు నోచుకోలేదంటే పరిస్ధితిని అర్థం చేసుకోవచ్చు. జూలై 1 నుంచి న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెకు దిగితే న్యాయస్థానాల తాళాలు తెరిచేవారు కూడా ఉండరు. ఇద్దరు న్యాయాధికారుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా దాదాపు 200 మంది న్యాయాధికారులు రెండు రోజులపాటు సామూహికంగా సాధారణ (క్యాజువల్) సెలవులో వెళ్లారు. అయితే మరో 11 మంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేయడంతో మరో 15 రోజులపాటు సామూహికంగా సెలవులో వెళ్లాలని న్యాయాధికారుల సంఘం ఇవాళ నిర్ణయించింది.