కెనడాలో ఘనంగా ‘తెలంగాణ నైట్’
ఒట్టావా: ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషిచేసి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేయడానికి పాటుపడతామని తెలంగాణ నైట్ - 2016 నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు నిర్వహించిన తెలంగాణ నైట్ - 2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్రపై కోదండరాం చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ గ్లోబల్, యూఎస్ఏ ప్రతినిధులు, హైదరాబాద్ డక్కన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్ వాసి, ఒంటారియో ప్రావిన్స్ ఆరోగ్యశాఖ మంత్రి దీపిక దామెర్ల గౌరవ అతిధిగా హాజరై ఇరు రాష్ట్రాల మధ్య సహకార కార్యక్రమాల గురించి వివరించారు. ఆత్మీయ అతిథిగా ప్రముఖ తెలుగు కళాకారుడు లోహిత్ హాజరై మిమిక్రీతో సభికులను ఆనందింపజేశారు. తెలంగాణ సాహితీవేత్త, డాక్టర్ ఎం.కులశేఖరరావును నిర్వహకులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలకుగానూ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క, సారలమ్మల నృత్యం అందరినీ విశేషంగా ఆకర్షించింది. గ్రేటర్ టొరంటోతో పాటు న్యూయార్క్, రోచెస్టర్, డిట్రాయిట్ నగరాల నుంచి 800 మందికిపైగా తెలంగాణ వాసులు ఈ వేడుకకు హాజరయ్యారు.