‘టామ్‌కామ్’పై విస్తృత ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్)కు విస్తృత ప్రచారం కల్పించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. టామ్‌కామ్ ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చి నెల రోజులు కావొస్తున్నా ఆశించిన స్పందన లభించడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
దీంతో టామ్కామ్వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించడం కోసం లఘు చిత్రాల ప్రసారం, కరప్రతాల పంపిణీ చేయాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. మొదటి దశలో ఐదు చిత్రాలను టీవీలు, సినీ థియేటర్లలో ప్రసారం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రారంభించనుంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం యువత దళారులను ఆశ్రయించి మోసపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పించాలని టామ్కామ్కు రూపకల్పన జరిగింది.