బడుగుల అభివృద్ధే లక్ష్యం
కరీంనగర్ : బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ 101వ జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వొడితెల సతీష్‌కుమార్, నగర మేయర్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహనీయుల జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో వారి సేవలను స్మరించుకుంటూ యువత వారి అడుగుజాడలలో నడుస్తుందని అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని కోరారు. బాపూజీ కులమతాలులేని సమాజనిర్మాణం కావాలని కోరుకోనేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయని మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడని గుర్తుచేశారు. 98 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చేనేత కార్మికుల బతుకులు బాగుపడాలని వారి సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. అలాంటి మహనీయుని పేరును నగరంలోని ఫోర్‌లేన్ రింగ్ రోడ్డుకు పెట్టాలన్నారు. నగర ప్రవేశం నుంచి కమాన్ వరకు సావిత్రిబాయి పూలే రోడ్డుగా నామకరణం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత, బీడీకార్మికులకు అండగా ఉంటుందని, చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.13.41 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.