Telangana Panchayat Election 2019
-
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు
-
పంచాయతీ ఫలితాల్లో దుమ్మురేపిన కారు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దుమ్మురేపుతోంది. సోమవారం 4,470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. మేజర్ పంచాయతీలు మినహా దాదాపు కౌంటింగ్ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ మరోసారి ఆ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు అత్యధికంగా 1373 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 343, టీడీపీ 9, సీపీఎం 10 స్థానాల్లో గెలుపొందారు. ఇంకా సగానికి పైగా స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. జిల్లాల వారిగా ఫలితాలు.. క్ర.సంఖ్య జిల్లా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సీపీఐ/ సీపీఎం ఇతరులు 1 ఆదిలాబాద్ 112 10 9 0 0 15 2 భద్రాద్రి 65 29 0 2 20 23 3 జగిత్యాల 50 22 1 1 0 41 4 జనగామ 51 21 0 0 0 9 5 భూపాలపల్లి 78 44 3 0 0 17 6 గద్వాల 64 19 0 0 0 6 7 కామరెడ్డి 84 32 0 0 0 13 8 కరీంనగర్ 30 09 03 07 0 33 9 ఖమ్మం 84 49 5 1 10 22 10 ఆసిఫాబాద్ 60 26 0 0 0 18 11 మహబూబ్‌నగర్ 110 8 3 12 0 96 12 మంచిర్యాల 44 06 0 0 0 26 13 మెదక్ 105 28 0 1 0 15 14 మేడ్చల్ 12 6 0 1 0 5 15 నిర్మల్ 90 20 08 0 1 11 16 నాగర్ కర్నూల్ 92 32 1 0 1 23 17 నల్గొండ 145 73 0 2 2 23 18 నిజామాబాద్ 89 9 1 0 0 26 19 పెద్దపల్లి 45 22 0 0 0 16 20 రాజన్నసిరసిల్ల 40 11 1 0 0 23 21 రంగారెడ్డి 75 43 6 3 0 23 22 సంగారెడ్డి 139 58 2 0 0 19 23 సిద్దిపేట 130 5 2 0 1 21 24 సూర్యపేట 73 43 4 1 2 5 25 వికారాబాద్ 91 40 0 0 1 13 26 వనపర్తి 24 7 1 0 0 33 27 వరంగల్ రూరల్ 131 31 0 0 0 8 28 యాదాద్రి 60 19 1 0 1 19 29 వరంగల్ అర్భన్ 13 0 0 0 0 0 30 మహబూబాబాద్ 67 28 0 0 0 11 మొత్తం 2,545 871 34 10 27 725 -
ప్రశాంతంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
గుండెపోటుతో ఎన్నికల ఏజెంట్ మృతి
సాక్షి, సూర్యపేట : తెలంగాణ తొలి పంచాయితీ ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎన్నికల ఏజెంట్ ఒకరు గుండెపోటుతో మరణించారు. వివరాలు.. విలాస కవి సత్యం రాజు(70) సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో ఎన్నికల ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా.. సోమవారం ఉదయం గుండెపోటు రావడం కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా దురదృష్టావషాత్తు మార్గమధ్యలోనే మరణించాడు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. -
బుజ్జగింపులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం షురువైంది. నామినేషన్ల ఉప సంహరణకు గడువు రేపటితో ముగియనుండటంతో నామినేషన్లు వేసిన వారిని బరిలోంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో కొన్నింటికి ఒకే ఒక నామినేషను దాఖలు కావడంతో ఈ పంచాయతీలు ఏకగీవ్రమైనట్లే. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. తొలి విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 177 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1,746 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గం పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒకే ఒక నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దీంతో ఈ నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య సుమారు 10 నుంచి 14 వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరగనుంది. నిజామాబాద్ రూరల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలంలో ఇప్పటికే రెండు చోట్ల ఏకగ్రీవం కాగా, మరికొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘మేజర్’పై ఎమ్మెల్యేల దృష్టి.. మేజర్ గ్రామ పంచాయతీలపై ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పంచాయతీలు దాదాపు తమ అనుచరులకే దక్కేలా చూస్తున్నారు. నామినేషన్లు వేసిన బలమైన అభ్యర్థులకు అవసరమైతే సహకార ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. సహకార సం ఘం డెరెక్టర్ స్థానానికి మద్దతిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానానికి అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తున్నారు. వార్డు సభ్యులకూ పోటీ.. సర్పంచ్ స్థానాలకే కాకుండా వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీల్లో ఈ పోటీ అధికంగా కనిపిస్తోంది. నందిపేట్ మేజర్ గ్రామ పంచాయతీలోని ఓ వార్డుకు ఏకంగా 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే వార్డు సభ్యులకు సైతం ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం అవుతోంది.అవకాశం వస్తే ఉప సర్పంచ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతో కొందరు వార్డు సభ్యునిగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుల సంఘాలు వార్డు సభ్యుల ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్‌గా స్థానాలుగా ప్రకటించిన వాటిలో కొన్ని చోట్ల కులాల మధ్య పోటీ నెలకొంది. బలమైన సామాజికవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా బరిలోకి దిగుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. -
గట్టి బందోబస్తు
నిజామాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ గట్టి బందోబస్తును చేపట్టనుంది. పోలీసు కమిషనర్ కార్తికేయ గురువారం పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 4,932 పోలింగ్ కేంద్రాల్లో 348 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు, అదనపు భద్రత చేపట్టనున్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతలపై అప్రమత్తం చేస్తారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఆయా గ్రామాల్లో పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలు, గతంలో వివాదాలు జరిగిన ప్రాంతాల్లో మూడంచెల పద్ధతిని చేపట్టే అవకాశం ఉంది. ఆయా గ్రామాల్లో, మండలాల్లో బైండోవర్లు చేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా వివరాలు నమోదు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీపీ కార్తికేయ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రతి గ్రామాన్ని పోలీసులు తప్పనిసరిగా సందర్శించి సమస్యలు తెలుసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ మాదిరిగానే వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. పెట్రోలింగ్ చేపట్టనున్నారు. నగదు, మద్యం పంపిణీలను నిరోధించేందుకు తనిఖీ బృం దాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణపై సీపీతో పాటు ఏసీపీలు , డీఎస్పీలు, పర్యవేక్షణ ముమ్మరం చేయనున్నారు. సమావేశంలో ఆదేశాలు.. సమీక్ష సమావేశంలో సీపీ కార్తికేయ పోలీసు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ అంశాలను, మండలాలు, గ్రామాల వారీగా పోలింగ్ బూత్‌ల వివరాలు తెలియజేశారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్ అధికారి గౌస్‌అలాం, ఏసీపీలు శ్రీనివాస్‌కుమా ర్, రాములు, రఘు, ప్రభాకర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మోగిన పంచాయతీ నగరా
సాక్షి, వరంగల్ రూరల్: పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21, 25, 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో 401 గ్రామ పంచాయతీలు, 3,544 వార్డులు ఉన్నా యి. మొత్తం ఓటర్లు 4,64,199 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,33,052, పురుషులు 2,31,138, ఇతరులు 9 మంది ఉన్నారు. అందులో బీసీలు 2,71,027, ఎస్సీలు 81,557, ఎస్టీ ఓటర్లు 72,363, జనరల్ 39,242 మంది ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఎస్సీలకు 75, ఎస్టీలకు 101, బీసీలకు 69, అన్‌రిజర్వ్‌డ్‌కు 156 గ్రామపంచాయతీలు కేటాయించా రు. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ ప్రక్రియనంతా డిసెంబర్ 29న పూర్తి చేశారు. మూడు విడతల్లో.. జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న మొదటి విడతలో 145 గ్రామపంచాయతీలు, 1,264 వార్డులకు, ఈ నెల 25న రెండో విడతలో 136 గ్రామపంచాయతీలు, 1,210 వార్డులకు, ఈ నెల 30న మూడో విడతలో 120 గ్రామ పంచాయతీలు, 1,070 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. మొదటి విడత.. మొదటి విడతకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 10న స్క్రూట్నీ, 11న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. గుర్తుల కేటాయింపు తర్వాత జనవరి 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడత రెండో విడత ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూట్నీ, 15న ఉపసంహరణ ఉంటుంది. జనవరి 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడత మూడో విడతకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న స్క్రూట్నీ, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జనవరి 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు.. గ్రామపంచాయతీ ఎన్నికలను ఎప్పటిలాగే ఉదయం నిర్వహించి సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. మధ్నాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. గ్రామంలోని వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వార్డుల వారీగానే ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించి అప్పటికప్పుడే ఫలితాలను ప్రకటిస్తారు. పూర్తిగా బ్యాలెట్ పేపర్లతో జరుగనున్న ఎన్నికలు కావడంతో కొన్ని గ్రామాల్లో ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫలితంపై పోటీలో ఉన్న అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే రీకౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్‌కు రూ.2 వేలు డిపాజిట్.. జనరల్ స్థానంలో గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే వారు రూ.2 వేలు, వార్డు మెంబ ర్కు రూ.500, రిజర్వేషన్ అయిన గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1,000, వార్డు మెంబర్ స్థానాలకు రూ.250 డిపాజిట్ చెల్లించా ల్సి ఉంటుంది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయొద్దు. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయొద్దు అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. తొలిసారిగా ‘నోటా’ ఎన్నికల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్న ఎన్నికల సంఘం తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటాను ప్రవేశపెట్టింది. ఇది బ్యాలెట్ పేపర్లో చివరి స్థానంలో ఉంటుంది. సర్పంచ్, వార్డు ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సారి నోటా ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మండలం పేరు జీపీలు వార్డులు చెన్నారావుపేట 30 258 నెక్కొండ 39 340 ఆత్మకూరు 16 152 దామెర 14 132 గీసుకొండ 21 188 మొత్తం 401 3,544 మండలం పేరు జీపీలు వార్డులు పరకాల 10 94 నడికుడ 14 138 శాయంపేట 24 212 నల్లబెల్లి 29 252 ఖానాపురం 20 178 రాయపర్తి 39 336 -
మోగిన పంచాయతీ నగారా!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 12,732 గ్రామ పంచాయతీలు, 1,13,170 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 7–21 తేదీల మధ్యలో తొలి దశ, 11–25 తేదీల మధ్యలో రెండో దశ, 16–30 మధ్యలో మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న తొలి దశ కింద 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ కింద ఈ నెల 25న 4,137 గ్రామ పంచాయతీలు, 36,620 వార్డుల్లో, మూడో దశ కింద ఈ నెల 30న 4,115 గ్రామ పంచాయతీలు, 36,718 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మూడు దశల కింద మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. తొలుత వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లతో అదే రోజు ప్రిసైడింగ్ అధికారి సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. చెయ్యెత్తే పద్ధతిలో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 200 లోపే ఉండడం, ఎక్కడా 600 మందికి మించి ఓటర్లు లేకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం సరిపోతుందని నాగిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా, 19 పంచాయతీలు మినహా అన్ని చోట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 17 పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం తీరకపోవడం, మరో రెండు పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికలు నిర్వహించడం లేదని నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో 1,48,033 మంది ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. ఓటేయనున్న కోటిన్నర మంది ఓటర్లు గతేడాది మే 17న ప్రచురించిన గ్రామీణ ఓటర్ల జాబితా ప్రకారం 68,50,309 మంది పురుషులు, 68,66,300 మంది మహిళలు, 860 మంది ఇతరులు కలిపి మొత్తం 1,37,17,469 మంది ఓటర్లున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా గత నవంబర్ 19న తొలి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించగా, మొత్తం పల్లె ఓటర్ల సంఖ్య 1,49,52,058కు పెరిగింది. మరో వారం రోజుల్లో రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించనుండడంతో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరగనుంది. గుర్తింపు రాజకీయ పార్టీలకు గతేడాది మే నెలలో ఓటర్ల జాబితాలను పంపిణీ చేశామని వి.నాగిరెడ్డి ప్రకటించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఓటేసేందుకు అవకాశం ఉండదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైన ఒక కార్డును పట్టుకొస్తే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. డిపాజిట్లు, ఎన్నికల వ్యయ పరిమితులు సర్పంచ్ స్థానానికి పోటీచేసేందుకు జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 డిపాజిట్‌ను చెల్లించాలి. జనరల్ కేటగిరీ వార్డు మెంబరు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250ల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 5వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5లక్షలలోపు, వార్డు అభ్యర్థులు రూ.50వేలలోపు.. 5వేల లోపు జనాభా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5లక్షలలోపు, వార్డు అభ్యర్థులు రూ.30వేల లోపు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయం నిర్దేశించిన పరిమితులకు మించితే తీవ్ర చర్యలు తప్పవని నాగిరెడ్డి హెచ్చరించారు. ఎవరైనా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేస్తే.. ఎన్నికల్లో గెలిచినా అనర్హత వేటు పడవచ్చన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రాశామని, ప్రభుత్వం ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అనుసరించి ఉంటుందని భావిస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదన్నారు. బ్యాలెట్‌పై అభ్యర్థుల పేరుండదు ! ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. 3 కోట్ల బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశామన్నారు. 3,36,34,279 బ్యాలెట్ పేపర్లు, 92,223 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేరు ఉండదని, కేవలం ఎన్నికల గుర్తు మాత్రమే ఉంటుందన్నారు. బ్యాలెట్‌పై అభ్యర్థుల పేరుతో పాటు చివర్లో నోటా ఉంటుందన్నారు. 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు లెక్కలను సమర్పించని కారణంగా 12,745 మందిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేశామన్నారు. వీరిలో సర్పంచ్‌గా గెలిచిన 9 మంది, పోటీ చేసిన 1300 మంది, వార్డు సభ్యుడిగా గెలిచిన 1266 మంది, పోటీ చేసిన 8,528 మంది, జడ్పీటీసీగా పోటీచేసి ఓడిపోయిన 311 మంది, ఎంపీటీసీగా పోటీచేసి ఓడిపోయిన 1,331 మంది అభ్యర్థులున్నారన్నారు. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్! షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచ్చిందని వి.నాగిరెడ్డి ప్రకటించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వం కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించడానికి వీలుండదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల యాత్రకు ఎన్నికల కోడ్ వర్తించదని, అయితే ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మైక్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతిస్తామన్నారు. మిగిలిన సమయాల్లో మైకుల ద్వారా శబ్ధకాలుష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రైవేటు వ్యక్తుల డబ్బులను జప్తు చేయమని, కేవలం ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు రవాణా చేసే డబ్బును మాత్రమే పట్టుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.