Telangana Pharmacy Council
-
800 రకాల ఔషధాల 'ధరలు పెరుగుదల'
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 800 రకాల అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులన్నింటి ధరలు 12.12 శాతం పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతారని, ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులపై భారం పడుతుందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ సంజయ్‌రెడ్డి అన్నారు. రక్త హీనత, మధుమేహం, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, టీబీ, వివిధ రకాల కేన్సర్లకు రోగులు ఉపయోగించే మందుల ధరలు పెరుగుతాయని చెపుతున్నారు. అలాగే మెడికల్ డివైజ్‌ల ధరలు కూడా భారీగా పెరుగుతాయని, జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) వీటి ధరలను పెంచిందని సంజయ్ పేర్కొన్నారు. అసలే కరోనా తర్వాత అనేకమంది పలు సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. దీంతో అనేకమంది నిత్యం పలు రకాల మందులు వాడుతున్నారు. మందుల ధరల పెంపువల్ల ఆదాయంలో కొంత భాగం వాటికి అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం పెంచింది. కాగా, ఏయే మందుల ధరలు పెరిగాయో వాటి జాబితాను కేంద్రం ఒకటిరెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని సంజయ్‌రెడ్డి తెలిపారు. -
ఫార్మసీ రిజిస్ట్రేషనా?..‘చలో విజయవాడ’
- ఏపీకి తరలివెళ్లిన ఫార్మసీ కౌన్సిల్ - ఇక్కడి ఫార్మసీ ఉద్యోగులూ అక్కడికే - తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేయనందునే.. - రాష్ట్రంలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ కార్యకలాపాలు స్తంభించాయి. తెలంగాణకు ప్రత్యేక ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ విజయవాడకు తరలిపోవడం తో ఐదు రోజులుగా రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ కార్యకలాపా లు నిలిచిపోయాయి. కనీసం కార్యాలయాన్ని తెరిచే పరిస్థితి కూడా లేక తాళాలు వేసి వదిలేశారు. కౌన్సిల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా విజయవాడ వెళ్లి ఏపీ ప్రభుత్వ పరిధిలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ చేయించుకోవాల్సిన తెలంగాణ అభ్యర్థులు ఇక విజయవాడకు వెళ్లాల్సి ఉంటుంది. రెండున్నరేళ్ల అలసత్వం... ఫార్మసీ అభ్యర్థులు చదువు పూర్తయ్యాక తప్పనిసరిగా ఫార్మసీ కౌన్సిల్లో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవా లి. ఆ తర్వాత ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించు కోవాలి. రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌కే కాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే ఫార్మసిస్టులకు గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్‌ను కౌన్సిల్ జారీ చేస్తుంది. ఇది ఉంటేనే విదేశాల్లో ఫార్మసిస్టులకు ఉద్యోగ అర్హత లభిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది ఫార్మసిస్టులుంటే.. అందులో 70 శాతం వరకు తెలంగాణ వారే ఉంటారు. ఇప్పటివరకు ఉమ్మడిగానే ఈ కౌన్సిల్ కొనసాగుతూ వచ్చింది. దాంతో తెలంగాణ అభ్యర్థులు కూడా ఏపీ ఫార్మసీ కౌన్సిల్లోనే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ చేయించుకుంటున్నారు. తెలంగాణ కౌన్సిల్ ఏర్పాటయ్యే వరకు ఏపీ కౌన్సిల్ చేసే రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇప్పటివరకు బాగానే గడిచింది. అయితే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ తన కార్యాలయాన్ని వారం రోజల క్రితం విజయవాడకు తరలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో కౌన్సిల్ కార్యకలాపాలు స్తంభించాయి. ఫార్మసీ కౌన్సిల్ విడిపోక పోవడంతో తెలంగాణ ఉద్యోగులు కూడా విజయవాడకు వెళ్లి జాయినింగ్ రిపోర్డు ఇచ్చారు. దీంతో నాంపల్లిలోని ఫార్మసీ కౌన్సిల్‌కు తాళాలు వేశారు. కౌన్సిల్ ఏర్పాటును ప్రతిపాదించని ట్రిబ్యునల్ ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి ముందు ఫార్మసీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలి. ఈ నివేదికను ఆధారం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీ చేయాలి. తర్వాత ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అందుకోసం తెలం గాణ ప్రభుత్వం 8 నెలల క్రితం ఫార్మసీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు గడిచినా ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటుపై ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ప్రతిపాదనే పంపలేదు. ఈ నేపథ్యంలో ఏపీ కౌన్సిల్ విజయవాడకు తరలిపోవడంతో గందరగోళం నెలకొంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.