- ఏపీకి తరలివెళ్లిన ఫార్మసీ కౌన్సిల్
- ఇక్కడి ఫార్మసీ ఉద్యోగులూ అక్కడికే
- తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు చేయనందునే..
- రాష్ట్రంలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ కార్యకలాపాలు స్తంభించాయి. తెలంగాణకు ప్రత్యేక ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ విజయవాడకు తరలిపోవడం తో ఐదు రోజులుగా రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ కార్యకలాపా లు నిలిచిపోయాయి. కనీసం కార్యాలయాన్ని తెరిచే పరిస్థితి కూడా లేక తాళాలు వేసి వదిలేశారు. కౌన్సిల్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా విజయవాడ వెళ్లి ఏపీ ప్రభుత్వ పరిధిలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ చేయించుకోవాల్సిన తెలంగాణ అభ్యర్థులు ఇక విజయవాడకు వెళ్లాల్సి ఉంటుంది.
రెండున్నరేళ్ల అలసత్వం...
ఫార్మసీ అభ్యర్థులు చదువు పూర్తయ్యాక తప్పనిసరిగా ఫార్మసీ కౌన్సిల్‌లో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవా లి. ఆ తర్వాత ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించు కోవాలి. రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌కే కాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే ఫార్మసిస్టులకు గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్‌ను కౌన్సిల్ జారీ చేస్తుంది. ఇది ఉంటేనే విదేశాల్లో ఫార్మసిస్టులకు ఉద్యోగ అర్హత లభిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది ఫార్మసిస్టులుంటే.. అందులో 70 శాతం వరకు తెలంగాణ వారే ఉంటారు. ఇప్పటివరకు ఉమ్మడిగానే ఈ కౌన్సిల్ కొనసాగుతూ వచ్చింది. దాంతో తెలంగాణ అభ్యర్థులు కూడా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లోనే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ చేయించుకుంటున్నారు.
తెలంగాణ కౌన్సిల్ ఏర్పాటయ్యే వరకు ఏపీ కౌన్సిల్ చేసే రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇప్పటివరకు బాగానే గడిచింది. అయితే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ తన కార్యాలయాన్ని వారం రోజల క్రితం విజయవాడకు తరలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో కౌన్సిల్ కార్యకలాపాలు స్తంభించాయి. ఫార్మసీ కౌన్సిల్ విడిపోక పోవడంతో తెలంగాణ ఉద్యోగులు కూడా విజయవాడకు వెళ్లి జాయినింగ్ రిపోర్డు ఇచ్చారు. దీంతో నాంపల్లిలోని ఫార్మసీ కౌన్సిల్‌కు తాళాలు వేశారు.
కౌన్సిల్ ఏర్పాటును ప్రతిపాదించని ట్రిబ్యునల్
ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి ముందు ఫార్మసీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలి. ఈ నివేదికను ఆధారం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీ చేయాలి. తర్వాత ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అందుకోసం తెలం గాణ ప్రభుత్వం 8 నెలల క్రితం ఫార్మసీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు గడిచినా ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటుపై ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ప్రతిపాదనే పంపలేదు. ఈ నేపథ్యంలో ఏపీ కౌన్సిల్ విజయవాడకు తరలిపోవడంతో గందరగోళం నెలకొంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫార్మసీ రిజిస్ట్రేషనా?..‘చలో విజయవాడ’
Published Wed, Dec 28 2016 3:46 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement