Telangana poets
-
గంగా జమున తెహజీబ్ కాపాడుకుందాం!
‘‘సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని... ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః’’ అంటే... ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి, తనలో సర్వభూతాలనూ, సమస్త భూతాలలో తననూ దర్శిస్తాడు, అని తాత్పర్యం. ఇదే నిజ హిందూవాదం. ఇదే హైద్రాబాదీయత. అదే నిజ జాతీయత. మతాలకతీతంగా కవుల సృజనకు జీ హుజూర్ అన్నది మన హైద్రాబాదీ గడ్డ. ఈ గడ్డపైన కవ్వాలి శతకాలు కీర్తనలు ఏకరూపంలో వొకే వేదిక మీద వొలికిన స్వరఝరీ భాగ్యనగరి. దక్కనీ ఆత్మకు ఏకాత్మ మన హైద్రాబాద్. భాగమతీ కాలి అందెల రవళిలో తన్మయించిన ఈ సజీవ సంస్కృతిని భగ్నం చేయడానికి కుట్రలు నడుస్తున్నయి. గాయాల తెలంగాణ స్వయం పాలనలో కుదురుకుంటున్న సమయాన, నిన్నటిదాకా లేని వో కొత్త సామాజిక సమస్య మత విద్వేషం రూపంలో ముందుకు వస్తున్నది. గంగా జమునల తహజీబ్‌కు కేంద్రమైన హైద్రాబాద్ భాగ్యనగరం నడి బొడ్డున, సామరస్యంతో జీవిస్తున్న మనుషుల నడుమ, మత చిచ్చును రగిలించే కుట్రలకు బీజం పడుతున్నట్టుగా అర్థమౌతున్నది. ఇటువంటి ప్రమాదకర మత విద్వేషాన్ని కవులు, రచయితలు, కళాకారులు, మొత్తంగా సృజనకారులుగా మనందరం ముక్తకంఠంతో వ్యతిరేకించవలసి వున్నది. మత సామరస్యాన్ని సారవంత గుణంగా పొదువుకున్న హైదరాబాదీయతను రక్షించుకోవాల్సిన సందర్భం వచ్చింది. హైద్రాబాదీయతే నిజ జాతీయత. మతం పేరుతో చరిత్రలో లేని విషయాలను ముందుకు తెచ్చి మనలను మందిముందు అవమానాలకు గురిచేస్తున్నరు. అబద్ధపు దుష్ప్రచారాలను తుత్తునియలు చేసి మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా నడుం బిగించవలసివున్నది. సంపద్వంతమైన దక్షిణాపథాన్ని కొల్లగొట్టడానికి, ఆక్రమించడానికి హైదరాబాద్ అనే పెద్ద గడపను గెలిచి తెలంగాణను తమ మతవాద విస్తరణకు ఎరగావేసే కుట్రలకు ఉత్తరాది శక్తులు కుట్రలు పన్నుతున్నయి. దాన్ని తిప్పికొట్టవలసిన సందర్భం ముంచుకువచ్చింది. ఇటువంటి హైద్రాబాద్ వారసత్వాన్ని నిలుపుకోవాల్సిన కష్ట కాలంలో మనం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మన జీవ సంస్కృతిని జీవితకాలం కోల్పోవాల్సిన ప్రమాదంలో పడిపోతాం. అరవయేండ్ల పోరాటాన్నించి, స్వయం పాలనలో సాంత్వన పొందుతూ ప్రశాంత వాతావరణంలో తనను తాను పునర్నిర్మించుకుంటున్న క్రమంలో, దేశంలో సగర్వంగా తలెత్తుకోని ముందడుగు వేస్తున్నది తెలంగాణ. ఈస మూసీల సంగమంలా వెలసిల్లిన అవ్యక్తపు ఆధ్యాత్మిక బోధనాస్థలి, ఆధ్యాత్మిక మడి భాగ్యనగరి హైద్రాబాద్‌ను కాపాడుకుందాం. ద్వేషంతో కూడిన వాచాలత్వం, అప్రజాస్వామిక నడవడితో కూడిన, ఉత్తరాది దాష్టీకాన్ని ఎదురిద్దాం. మన కవనంతో గానంతో మేథో సృజన రచనలతో యోచనాత్మకమైన దార్శనిక దృక్పథంతో ప్రజలను చైతన్యం పరిచి నాటి ఉద్యమ స్ఫూర్తితో మతవిద్వేష శక్తుల కుట్రలను నిలువరిద్దాం. ఇట్లు... – తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, సృజనకారులు – కవి సిద్దార్థ, అల్లం నారాయణ, కె.శ్రీనివాస్, వర్ధెల్లి మురళి, ఎన్.గోపి, కె.శివారెడ్డి, ఓల్గా, నందిని సిధారెడ్డి, గోరటి వెంకన్న, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, షాజాహాన, గోగు శ్యామల, జూపాక సుభధ్ర, మహెజబీన్, కుప్పిలి పద్మ, జ్వలిత, మెర్సీ మార్గరేట్, పెన్నా శివరామకృష్ణ, జిలుకర శ్రీనివాస్, శ్రీనివాస్ దెంచనాల, దేశపతి శ్రీనివాస్, మునాస వెంకట్, పసునూరి రవీందర్, కృపాకర్ మాదిగ, పగడాల నాగేందర్, యాకూబ్, అక్కినేని కుటుంబరావు, వేణు ఊడుగుల, ఎన్.శంకర్, బతుకమ్మ ప్రభాకర్, ఎస్.రఘు, ఏలె లక్ష్మణ్, కార్టూనిస్ట్ శంకర్, కోయి కోటేశ్వర్ రావు, సుద్దాల అశోక్ తేజ, స్కైబాబ, మోహన్ రుషి, జూలూరి గౌరీశంకర్, వఝల శివకుమార్, అన్నవరం దేవేందర్, నలిమెల భాస్కర్, పిల్లలమర్రి రాములు, నాళేశ్వరం శంకరం, ఒద్దిరాజు ప్రవీణ్, వాసు, కోడూరి విజయ్ కుమార్, కాంచనపల్లి, దామెర రాములు, అమ్మంగి వేణుగోపాల్, సీతారామ్, ప్రసేన్, వేముగంటి మురళి, బన్న అయిలయ్య, శిలాలోలిత, సంగిశెట్టి శ్రీనివాస్, బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, మచ్చ దేవేందర్, బెల్లి యాదయ్య, వనపట్ల సుబ్బయ్య, తైదల అంజయ్య, ఆదేశ్ రవి, మోత్కూరి శ్రీనివాస్, శిఖామణి, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎం.ఎస్.నాయుడు, తాడి ప్రకాశ్, జివి రత్నాకర్, గుడిపల్లి నిరంజన్, చిక్కా రామదాసు, మామిడి హరికృష్ణ, బంగారి బ్రహ్మం, మౌనశ్రీ మల్లిక్, పుష్పగిరి, రమేశ్ హజారి, ఏనుగు నరసింహారెడ్డి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు, మల్లేపల్లి లక్ష్మయ్య -
ఇదే పురిటి గడ్డ
తెలుగు+ ఆణెము అనే రెండు పదాలతో ఏర్పడిన పదం తెలంగాణం. ఆణెమంటే దేశమని అర్థం. అతి ప్రాచీన కాలం నుంచి తెలంగాణ ప్రాంతం సాహిత్య రచనా వ్యాసంగానికి నిలయమై విరాజిల్లింది. ఎన్నో ప్రక్రియల్లో తొలి గ్రంథాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయంటే సాహిత్యరంగంలో తెలంగాణ ఎంత ప్రముఖమైందో ఊహించుకోవచ్చు. తొలి గ్రంథం తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహనులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 3వ శతాబ్దం వరకు సుమారు 500 సంవత్సరాలు పాలించినారు. క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటికే తెలంగాణలో సాహిత్య రచన ఆరంభమైంది. ప్రపంచ కథా సాహిత్యంలోనే తొలిగ్రంథంగా ప్రశస్తి పొందిన బృహత్కథ కథాకావ్యాన్ని గుణాఢ్యుడు కోటిలింగాల ప్రాంతంలో రచించాడని పండితుల అభిప్రాయం. పైశాచీ భాషలో రాసిన ఈ గ్రంథం మనకు ఇప్పుడు లభ్యం కాకపోయినా కథా సరిత్సాగరం, బృహత్కథా మంజరి మొదలగు గ్రంథాలు ఆ లోటును తీరుస్తున్నాయి. తొలి సంకలనం ఈ రోజుల్లో కవితా సంకలనాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఒకే రచయిత రచనలు కాక వివిధ రచయితల రచనలు ఇందులో చోటు చేసుకుంటాయి. వీటిని సంకలన గ్రంథాలంటారు. ఈ ప్రక్రియకు కూడా తెలంగాణమే ఆది బీజం వేసింది. సుమారు 270 మంది ప్రాకృత కవులు రచించిన ప్రాకృత గాథలను (శ్లోకాలను) శాతవాహన రాజైన హాలుడు గాథాసత్తసఈ (గాథా సప్తశతి) పేరుతో సంకలనం చేశాడు. ఇందులో పిల్ల, అత్త, పొట్ట, కుండ, కరణి, మోడి మొదలైన తెలుగు పదాలు చోటుచేసుకున్నాయి. తొలి కందం జినవల్లభుడు (క్రీ.శ. 940) వేయించిన కుర్క్యాల (కరీంనగర్ జిల్లా) శాసనంలో మూడు తెలుగు పద్యాలు కనిపిస్తున్నాయి. ఇవి తెలుగులో రచించిన తొలి కంద పద్యాలు. అందువల్ల కంద పద్యానికి పుట్టినిల్లు తెలంగాణమే అని చెప్పవచ్చు. ఒక పద్యాన్ని గమనించండి. జిన భవనము లెత్తించుట జిన పూజల్సేయుచున్కి జినమునులకు న త్తిన యన్నదానం బీవుట జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్ తొలి తెలుగు గ్రంథం 11వ శతాబ్దిలో నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతాన్ని తొలి తెలుగు గ్రంథంగా చెప్పుకుంటున్నాం. కానీ తెలంగాణలో అంతకుముందే అంటే 10వ శతాబ్దిలోనే జినవల్లభుని ప్రోత్సాహంతో మల్లియ రేచన ‘కవి జనాశ్రయ’మనే ఛందో గ్రంథాన్ని 113 కందాలలో రచించాడు. ఇందులోనే ఒక కవి స్తుతినీ, సుకవితా లక్షణాలనూ చెప్పడం వల్ల కావ్యాల్లో అవతారికా మార్గం వేసిన మొదటి కవి మల్లియ రేచనే. తొలి జంటకవులు జంటకవుల సంప్రదాయం కూడా మొదట ఏర్పడింది తెలంగాణలోనే. కాచ భూపతి, విట్ఠలరాజు అనే కవులు జంటగా రంగనాథ రామాయణంలోని ఉత్తరకాండను రచించారు. తెలుగులో తొలి వృత్తపద్యం తెలుగులో లభించిన తొలి వృత్తపద్య శాసనం విరియాల కామసాని శాసనం (క్రీ.శ.1000) వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో లభించింది. ఇందులో మూడు చంపకమాలలు, 2 ఉత్పలమాలలు కన్పిస్తాయి. తొలి సంకలనం తెలుగులో సంకలన ప్రక్రియకు ఆద్యుడు మడికి సింగన తెలంగాణ ప్రాంతం వాడే. ఈయన రచించిన సకల నీతి సమ్మతం తెలుగు సంకలన గ్రంథాల్లో మొట్టమొదటిది. ‘ఒక చోట గానబడగ సకల నయ శాస్త్రమతములు సంగ్రహించి గ్రంథమొనరింతు లోకోపకారముగను’ అని గ్రంథ విషయాన్ని పేర్కొన్నాడు. తొలి వచన సంకీర్తనలు వచన సంకీర్తన ప్రక్రియలో తొలుతగా సింహగిరి వచనాలను రచించిన కవి తెలంగాణకు చెందిన శ్రీకంఠ కృష్ణమాచార్యులు. ‘స్వామీ! సింహగిరి నరహరీ! నమో నమో దయానిధీ’ మకుటంతో ఈయన నాలుగు లక్షల భక్తి పూరిత వచనాలను రచించినాడని ప్రతీతి. కానీ ప్రస్తుతం 300లోపు గానే లభిస్తున్నాయి. తొలి పురాణ అనువాదం సంస్కృతంలోని పురాణాన్ని తొలిసారిగా తెలుగులో అనువాదం చేసిన కవి తెలంగాణకు చెందిన మారన మహాకవి. సంస్కృతంలోని మార్కండేయ పురాణాన్ని కావ్యగుణ శోభితంగా రచించి లె లుగులో తర్వాతి ప్రబంధ కవులకు మార్గదర్శకుడైనాడు. – ఆచార్య రవ్వా శ్రీహరి తొలి కల్పిత కావ్యం తొలి తెలుగు కల్పిత కావ్యానికి కూడా బీజం వేసింది తెలంగాణ ప్రాంతమే. సూరన ధనాభిరామం మొదటి కల్పిత కావ్యం. ధనం ముఖ్యమా? సౌందర్యం ముఖ్యమా? అనే విషయంపై కుబేరుడు, మన్మథుడు వాదించుకోవడం ఇందులో ప్రధాన వస్తువు. కవి రాచకొండ సామ్రాజ్యంలోనివాడు. తొలి నిరోష్ఠ్య రచన తెలుగులో మొదటి నిరోష్ఠ్య రచనా, మొదటి అచ్చ తెలుగు నిరోష్ఠ్య రచనా తెలంగాణలోనే ప్రారంభమైంది(అంటే పెదాలతో ఉచ్చరించే ప, బ, మ లాంటి అక్షరాలను మినహాయించి రాసినవి). ఆసూరి మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర అనే నిరోష్ఠ్య కావ్యాన్నీ, సీతా కల్యాణమనే అచ్చ తెలుగు నిరోష్ఠ్య కావ్యాన్నీ రచించాడు. తొలి వచన రచన, యక్షగానం తొలి తెలుగు వచన రచనౖయెన ప్రతాపరుద్ర చరిత్ర కూడా తెలంగాణలో వెలసిందే. ఏకామ్రనాథుడు కర్త. ఇది తెలుగు వచన రచనే కాక తొలి చారిత్రక గ్రంథం కూడా. రాయవాచకం కంటే ముందే వచ్చిన రచన. 16వ శతాబ్దికి చెందిన కందుకూరి రుద్రకవి దేవరకొండ తాలూకాలోని జనార్దన కందుకూరి గ్రామ నివాసి అని చారిత్రిక పరిశోధకులు బి.ఎన్.శాస్త్రి పేర్కొన్నారు. ఈయన రచించిన సుగ్రీవ విజయం తెలుగులో వచ్చిన మొదటి యక్షగానంగా పేర్కొనవచ్చు. తొలి బాటలు వేసిన పాల్కురికి తెలుగులో ద్విపద కావ్యానికి పురుడు పోసింది తెలంగాణయే. వరంగల్లు జిల్లా పాలకుర్తి నివాసి పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం మొదటి ద్విపద కావ్యమే కాక స్వతంత్రమైన తొలి వీరశైవ పురాణం కూడా. సాంఘికాంశాలు చిత్రించిన మొదటి సాంఘిక కావ్యంగా కూడా దీనికి ప్రసిద్ధి ఉంది. మకుట నియమం, సంఖ్యా నియమం శతకాలలో మొదటిదైన వృషాధిప శతకం కూడా తెలంగాణలో వెలువడిందే. పాల్కురికి సోమనాథుడే 108 చంపకోత్పల మాలికలతో రచించిన ఈ శతకం తర్వాతి కవులకెందరికో మార్గదర్శకమైంది. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో విశిష్టమైన రచనలు చేసిన ప్రతిభామూర్తుల్లో కూడా సోమనాథుడు ఆద్యుడే. ఆయన పండితారాధ్య చరిత్ర లె లుగులో మొదటి విజ్ఞాన సర్వస్వంగా భావించవచ్చు. ఉదాహరణ, రగడ ప్రక్రియల్లోనూ ఆయన గ్రంథాలే తొలి రచనలు. -
ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు
కార్యాచరణ రూపొందిస్తున్న టీజేఏసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని యోచిస్తోంది. ఉద్యమ ఘట్టాలను, సన్నివేశాలను ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తిని, వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిఫలించేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టనుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఓయూలోనే జూన్ 2న భారీ కార్యక్రమానికి జేఏసీ రూపకల్పన చేస్తోంది. జూన్ 1నే మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో వేడుకలను నిర్వహించాలని యోచిస్తోంది. అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 2 సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల తెలంగాణ ధూంధాం నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తోంది. ఇందులో తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, ఉద్యమ సంఘాల నేతలను భాగస్వామ్యం చేయాలని జేఏసీ భావి స్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఈ నెల 25న తిరిగి రానున్నారు. ఆయన హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత దీనిపై పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది.