Telangana Police Recruitment Board
-
Telangana: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి ఈ మార్పులు చేసింది. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30న నిర్వహించనున్నారు. ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్చారు. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా 11వ తేదీకి మార్పు చేశారు. కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి టీఎస్ఎల్పీఆర్బీ మార్పు చేసింది. చదవండి: (క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి) -
Telangana: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 554 ఎస్ఐ పోస్టుల భర్తీకి ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న పోలీసు నియామక మండలి పరీక్ష నిర్వహించింది. -
‘కానిస్టేబుల్ పరీక్ష’కు నిమిషం నిబంధన
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6.61 లక్షల మందికి పైగా హాజరవుతుండగా సిటీలోనూ పెద్ద సంఖ్యలోనే రాయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్దా అభ్యర్థులను క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను బందోబస్తు మధ్య జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్ సిబ్బందికి అప్పగించడం... ఇలాంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్ ఎం.రమేష్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై కన్నేసి ఉంచాలని, ప్రతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని స్థానిక పోలీసులకు అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలకు అనుమతించరు. సెల్ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్ వాచీలు, క్యాలిక్లేటర్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహందీ, టాటూలకు దూరంగా ఉండాలి. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, పెన్ మాత్రమే తెచ్చుకోవాలి. హాల్ టిక్కెట్‌పై బోర్డు సూచించిన విధంగా పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా అతికించుకుని రావాలి. -
పోలీసు పోస్టులకు 12.7 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన వివిధ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లోని సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ హోదాతో ఉన్న 17 వేల పైచిలుకు పోస్టులకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మొత్తం ఉద్యోగాలకు ఏడు లక్షల మంది అభ్యర్థులు 12.7 లక్షల దరఖాస్తులను దాఖలు చేసినట్టు రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సారి దాదాపు 1.3 లక్షల మంది మహిళా అభ్యర్థులు 2.8 లక్షల దరఖాస్తులు దాఖలు చేసినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
పోలీసు కొలువు కొట్టేలా!
సాక్షి, హైదరాబాద్: పోలీసు కావడం కొందరి కల.. మరికొందరి ఆశ... ఇంకొందరి ఆశయం... సామాజిక, ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆసక్తి ఉన్నప్పటికీ అనేక మంది ఎంపిక పరీక్షలకు దూరంగా ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పేరుతో ఉచిత శిక్షణ ఇస్తోంది. 2016లో పశ్చిమ మండలంలో ప్రారంభమైన ఈ విధానం 2018లో అయిదు సెంటర్లలో 5 వేల మందికి విస్తరించింది. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు ఈసారి నగరంలోని 11 సెంటర్లలో తొలి దశలో 7500 మందికి జరుగుతోంది. జేసీపీ ఎం.రమేష్, అదనపు డీసీపీ పరవస్తు మధుకర్‌స్వామి నేతృత్వంలో ఇవి సాగుతున్నాయి. అనూహ్య స్పందనతో ఎంపిక పరీక్ష... సబ్– ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ వంటి పోలీసు పరీక్ష హాజరవ్వాలనే ఆసక్తి, అర్హతలు ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడాన్ని నగర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా అన్ని అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తోంది. ఈ నేపథ్యంలో గణనీయమైన పోటీ ఏర్పడటంతో తొలిసారిగా ఎంపిక పరీక్ష నిర్వహించారు. మొత్తం 21 వేల మంది హాజరుకాగా వడపోత తర్వాత తొలి దశలో 7,500 మందిని ఎంపిక చేసి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇండోర్ ట్రైనింగ్‌గా పిలిచే ఆంగ్ల, కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర సహా మొత్తం 12 అంశాలతో పాటు అవుట్ డోర్ ట్రైనింగ్ దేహ దారుఢ్యం, వ్యాయామం వంటివీ ఈ శిక్షణలో భాగంగా నిష్ణాతుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. పేదలకు ఉచితంగా భోజనం వసతి.. ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ సైతం అందించార. సిటీ పోలీసుల ప్రీ– రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు హాజరవుతున్న వారిలో నిరు పేదలూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ మండలంలోని ఆయా ప్రాంతాలకు చెందిన వారికి ఉచితంగా భోజన సౌకర్యాన్నీ కల్పించారు. మిగిలిన వారికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో రూ.5 భోజనం అందిస్తున్నారు. దేశ దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఆయా జోన్లలో ఉన్న గ్రౌండ్స్‌లో ప్రతి రోజూ ఉదయం దేహ దారుఢ్య పరీక్షలకు సంబంధించి 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లు గుర్తించి సరి చేస్తూ అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి వారం పరీక్షలు నిర్వహణ.. గతంలో జరిగిన పోలీసు శిబిరాల్లో శిక్షణ తీసుకుని ఎంపికైన వారి ద్వారానూ ఈ శిక్షణలు జరుగుతున్నాయి. అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు వారిలో ఉన్న లోపాలు గుర్తించడానికి ప్రతి ఆదివారం మాక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా వెనుకబడిన వారిని గుర్తిస్తున్నారు. వీరికి సంబంధించి ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టే ట్రైనర్లు అదనపు శిక్షణ ఇస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభాపాటవాలు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆశయం, కొత్వాల్ సీవీ ఆనంద్ ఆలోచనతోనే యువతకు ఈ అవకాశం వచ్చింది. ప్రతి అభ్యర్థిపైనా ప్రత్యేక శ్రద్ధ భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నా. ఎస్సై, కానిస్టేబుల్ రెండు పోస్టులకు అప్లై చేశా. ట్రైనింగ్ కూడా ఆ కోణంలోనే సాగుతోంది. కాస్లులో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరి మీదా శ్రద్ధ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందిస్తున్నారు. సిటీ పోలీసులు పీఆర్టీ క్యాంప్‌లో ఇప్పటి వరకు చాలా సబ్జెక్టు నేర్చుకున్నా. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. – రిహానా, పరేడ్‌గ్రౌండ్స్ క్యాంప్ అభ్యర్థిని \టార్గెట్ 30 శాతం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు, సూచనల మేరకు పకడ్బందీగా శిక్షణ ఇస్తున్నాం. ప్రతి సబ్జెక్టును అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు బోధిస్తున్నారు. గతంలో నిర్వహించిన పీఆర్టీకి హాజరైన అభ్యర్థుల్లో 20 శాతం మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి కనీసం 30 శాతం మంది విజయం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నాం. – పరవస్తు మధుకర్ స్వామి, అదనపు డీసీపీ (చదవండి: జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా) -
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ట్రాన్స్జెండర్ల డిమాండ్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఇన్‌వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్‌లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ జోడించాలని డిమాండ్ చేశారు. -
పోలీసు ఉద్యోగాలకు.. లక్ష మంది మహిళల దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు శుక్రవారం సాయంత్రం వరకు 4.5 లక్షల దరఖాçస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 4.5 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షల మంది వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 23 శాతం అంటే ఒక లక్ష మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పురుషులు 77 శాతం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 6 శాతం ఓపెన్ కేటగిరీ, 53 శాతం బీసీ, 22 శాతం ఎస్సీ, 19 శాతం ఎస్టీ అభ్యర్థులున్నట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు మూడు వంతుల్లో దాదాపు రెండు వంతుల మంది పరీక్ష మాధ్యమం తెలుగు మీడియం ఎంచుకున్నారని, ఒక వంతు ఇంగ్లిష్ మీడియం, 0.2 శాతం ఉర్దూ మాధ్యమం ఎంచుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో వారం మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేయడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదముందని అప్రమత్తం చేశారు. కాగా, ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు సమయం ఉన్న సంగతి తెలిసిందే. -
ఫాలో.. పీఆర్బీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన సమయంలో అన్ని శాఖల దృష్టి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ)పై పడింది. తెలంగాణలో కొత్త జోన్ల పునర్వ్యవస్థీకరణకు ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన దరిమిలా తొలి ఉద్యోగ నోటిఫికేషన్ పీఆర్బీ నుంచి వెలువడటంతో.. మిగిలిన శాఖల ఉన్నతాధికారులు ఈ నోటిఫికేషన్ జారీలో అవలంబించిన విధి విధానాలను నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. కొత్త జోన్ల వ్యవస్థ అమలును జూన్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు రోజులకే అంటే జూలై 4వ తేదీన పీఆర్బీ 151 ఏపీపీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువరించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మంది (2016లో సుమారు 10 వేలు, 2018లో 15 వేల మంది)ని భర్తీ చేసిన విభాగంగా గుర్తింపు సాధించిన బోర్డు.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా, పకడ్బందీ నిబంధనలతో ఈ పోస్టుల భర్తీ ప్రకియను చేపట్టింది. త్వరలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 19 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి సైతం బోర్డు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతర శాఖల అధికారులు, పీఆర్బీ రూపొందించిన విధానాలపై దృష్టి సారించారు. ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయితే, పీఆర్బీ చైర్మన్ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో రూపొందించిన ఈ నియామక నిబంధనలను యథాతథంగా తీసుకోవడం గమనార్హం. కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనలను ప్రభుత్వమే రూపొందించినప్పటికీ, వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇతర శాఖలు పీఆర్బీ విధివిధానాలను పరిశీలించే పనిలో పడ్డాయి. 95 శాతం పోస్టులు స్థానికులకే.. కొత్త జోనల్ వ్యవస్థలో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం పకడ్బందీగా విధివిధానాలను రూపొందించింది. వీటిని అమలు చేసే పనిలో పీఆర్బీ ఇప్పటికే ముందడుగు వేసింది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం.. నియామకాల్లో తెలంగాణలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం..ఎవరైతే ఒకే జిల్లాలో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యనభ్యసించి ఉంటారో వారినే స్థానికులుగా తీసుకుంటారు. దీని ప్రకారం చూస్తే.. కేవలం 5 శాతం పోస్టులే స్థానికేతరులకు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. ఇలా పొరుగు రాష్ట్రం వారితో పాటు, పక్క మల్టీజోన్ వారు కూడా స్థానికేతరులే అయ్యేలా నిబంధనలు రూపొందించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్థానికతను రుజువు చేసుకునేందుకు అభ్యర్థులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెవెన్యూ అధికారుల నుంచి ఏడేళ్ల ‘నివాస ధ్రువీకరణ’ పత్రాన్ని పీఆర్బీ అనివార్యం చేసింది. సుదీర్ఘ ప్రక్రియ అయినా.. మిగిలిన శాఖల్లో ఉద్యోగాల భర్తీ.. పోలీసు పరీక్షల్లా క్లిష్టంగా, అనేక దశల్లో ఉండదు. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి. పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీ మరో కీలక అంశం. ఆ తర్వాత రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థులపై పోలీసు ఎంక్వైరీ, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికోసం మరో రకమైన విచారణ, యూనివర్సిటీల సాయంతో వారి సర్టిఫికెట్ల నిర్ధారణ, అభ్యంతరాల స్వీకరణ– నివృత్తితో కూడిన సుదీర్ఘ ప్రక్రియ అంతటినీ గతంలో పక్కాగా అమలు చేసిన అనుభవం పీఆర్బీకి ఉంది. అందుకే బోర్డు విధానాలు అదర్శంగా నిలుస్తున్నాయి. వివాద రహితంగా ఉండటంతో... 2018లో రిక్రూట్మెంట్ సందర్భంగా పీఆర్బీ తమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసింది. ఈ కారణంగానే ఆ సమయంలో తలెత్తిన పలురకాల న్యాయపరమైన అభ్యంతరాలన్నీ పిటిషన్ దశలోనే వీగిపోయాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుని, ఉద్యోగ ఖాళీల భర్తీ పనిలో ఉన్న పలు శాఖలు.. పీఆర్బీ అనుసరించిన విధానాన్ని పరిశీలిస్తున్నాయి. ఇందులో తమకు కావాల్సిన అంశాలను తీసుకుని అమలు చేయనున్నాయి. -
15 వేల పోలీసు కొలువులు
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. త్వరలోనే పోలీసుశాఖలో మరో 15,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కసరత్తు చేస్తోంది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం గతేడాది జారీ చేసిన పోలీసు నియామకాల ప్రక్రియను టీఎస్ఎల్పీఆర్బీ వేగవంతం చేసింది. శారీరక, తుది రాత పరీక్షలు విజయవంతంగా ముగించిన అభ్యర్థులకు ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. త్వరలోనే కటాఫ్ మార్కులు ప్రకటించి అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో తలమునకలైంది. ఈ ప్రక్రియ పూర్తయితే డిపార్ట్మెంట్లోకి కొత్తగా 18,500 మంది అధికారులు విధుల్లో చేరుతారు. వారిలో 17,156 కానిస్టేబుల్, 1,275 ఎస్సైలు ఉంటారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే.. గతేడాది మేలో విడుదలైన టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ప్రకారం పాత జిల్లాల ప్రాతిపదికగా ఖాళీల భర్తీ చేపడుతున్నారు. కానీ త్వరలో చేపట్టబోయే రిక్రూట్మెంట్లో మాత్రం 33 కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల నియామకం చేపట్టే ఆలోచనలో ఉన్నారు. ఆలోగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 18,500 పోస్టులను భర్తీ చేశాక మరోసారి సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ తదితర విభాగాల్లో కొత్త జిల్లాలవారీగా ఖాళీలను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే దాదాపు 15,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వాటిలో దాదాపు 14,000 కానిస్టేబుళ్లు, సుమారు 1,000 ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారని సమాచారం. వీక్లీ ఆఫ్ అమలుకు ఇక మార్గం సుగమం.. ప్రస్తుతం పోలీసుశాఖలో 32 వేల మంది సివిల్, 14 వేల మంది ఏఆర్, 8 వేల మంది వరకు టీఎస్ఎస్పీ కలిపి దాదాపు 54,000 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్న పోలీసుశాఖ అనేక దశాబ్దాల తరువాత వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తోంది. త్వరలో డిపార్ట్మెంట్లో చేరబోయే 18,500 మంది చేరికతో పనిభారం కాస్త తగ్గనుంది. వారికి అదనంగా మరో 15 వేల మంది చేరితే డిపార్ట్మెంట్కు మరింత ఉపశమనం లభించనుంది. -
చిప్ సిస్టమ్ తొలగించాలి : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్‌లో సెన్సార్ చిప్ సిస్టమ్‌ను తొలగించాలని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారమిక్కడ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆందోళన నిర్వహించారు. రేడియో ఫ్రిక్వేన్సీ ఐడెంటిఫై(ఆర్ఎఫ్ఐ) సిస్టం ద్వారా ఈవెంట్స్ నిర్వహించడం వలన ఇబ్బందులు తలేత్తాయని వారు ఆరోపించారు. ఈవెంట్స్‌లో సెలక్ట్ కాని వారిని కూడా తుది పరీక్షకు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. -
20 నుంచి ఎస్ఐ రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు సబ్ఇన్స్పెక్టర్ రాత పరీక్షల షెడ్యూలు ఖరారైంది. ఈనెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18 అర్ధరాత్రి వరకు అభ్యర్థులు http://www.tslprb.in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎస్ఐ సివిల్, టెక్నికల్ రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేసింది. ఇటీవల దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 1,05,061 మంది తుదిరాత పరీక్షకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరంతా 20 నుంచి జరగబోయే తుది పరీక్షలు రాయనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలు, బయోమెట్రిక్ యంత్రాలు, హాల్‌టికెట్లను సిద్ధం చేశారు. హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాకపోతే..: హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాని అభ్యర్థులు support@tslprb.in ఈ–మెయిల్ చేయాలని లేదా 9393711110, 9391005006 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చేది లేదని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తీసుకురావొద్దని స్పష్టం చేసింది. చదువుకునే సమయమేదీ.. పోలీసు శాఖలో దాదాపు 3 వేల మంది కానిస్టేబుళ్లు ఎస్ఐ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1,500 మందికిపైగా తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. తుది రాత పరీక్ష రాసేందుకు తగినంత సమయం లేదని మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న వీరు.. షెడ్యూలులో మార్పు లేకపోవడంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుళ్లు పోలింగ్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు, శ్రీరామనవమి వేడుకలకు బందోబస్తు కోసం డ్యూటీల్లో చేరారు. ఇక తమకు చదువుకునే సమయం ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సెలవులు పెట్టి చదువుకుంటున్న కానిస్టేబుళ్లకు డీజీపీ కార్యాలయం నోటీసులు పంపింది. ఎన్నికల నేపథ్యంలో ఎవరికీ సెలవులు లేవని, ఏప్రిల్ 1లోగా రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వారంతా వచ్చి ఎన్నికల విధుల్లో చేరారు. కాగా, ఎస్ఐ రాత పరీక్షలకు సిద్ధమవుత్నున పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు శ్రీరామనవమి తర్వాత సెలవు ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. శ్రీరామనవమి అనంతరం తుది రాత పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు సెలవు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ మేరకు అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించడం లేదు. -
పోలీసు అభ్యర్థులారా.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల కోసం వివిధ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసుశాఖ సూచించింది. నకిలీ ఈమెయిళ్లు, వెబ్సైట్లు సృష్టించి దళారులు అభ్యర్థులను మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత పోలీసు నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని ఇందులో ఎలాంటి అవకతవకలకు తావు లేదని బుధవారం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) స్పష్టంచేసింది. అభ్యర్థులకు నకిలీ ఈ–మెయిళ్లు, వీడియోలు పంపి మోసగాళ్లు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారని.. ఇలాంటి ఈ–మెయిళ్లు వచ్చినా, వెబ్సైట్లు కనిపించిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఈ తరహా మోసాలకు పాల్పడేవారికి ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని తెలిపింది. అన్ని పరీక్షల ఫలితాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ (https://www.tslprb.in) వెబ్సైట్లోనే తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఇతర సందేహాలు ఏమైనా ఉంటే.. 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని పేర్కొంది. అభ్యర్థులకు పెర్ఫామెన్స్ షీట్లు.. నియామక ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేసుకునే విధంగా ఈ సారి పోలీసుశాఖ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. ఇందుకోసం గత 5 వారాలుగా వివిధ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఆయా పరీక్షల వారి పెర్ఫామెన్స్ షీట్లను వారికి ఆన్లైన్ ద్వారా పంపామని వివరించింది. ఇప్పటివరకు దాదాపుగా 2,17,361 మంది అభ్యర్థులకు జారీ చేశామని తెలిపింది. వీరంతా వారి ఐడీల ద్వారా లాగిన్ అయి చూసుకోవచ్చంది. ఇంకా 250 పెర్ఫామెన్స్ షీట్లు మాత్రం సాంకేతిక కారణాల వల్ల పంపలేకపోయామని, వాటినీ త్వరలోనే పంపుతామంది. ఇక దరఖాస్తులు సమర్పించే సమయంలో కొందరు అభ్యర్థులు కొన్నిచోట్ల పొరపాట్లు చేశారని తెలిపింది. ఈ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వీరందరూ నిరభ్యంతరంగా తర్వాతి పరీక్షలు రాసుకోవచ్చని సూచించింది. త్వరలోనే ఎడిట్ ఆప్షన్ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని బోర్డు వెల్లడించింది. ఫిజికల్ టెస్ట్‌ల సమయంలో తప్పులు జరిగితే.. దేహదారుఢ్య పరీక్షల సమయంలో కుల ధ్రువీకరణ పత్రం సమర్పణలో జాప్యం చేసిన అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్ మేన్ల ఆప్షన్లు, జెండర్ విషయంలో తప్పులు చేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఏమైనా మార్పులు చేయాలనుకునే వారు.. ఈ నెల 28, 29న అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్ (ఎస్ఏఆర్ సీపీఎల్)లో చీఫ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులను ఉదయం 6 గంటల తర్వాత కలవొచ్చని బోర్డు సూచించింది. అభ్యర్థుల సమస్యలు విన్న తర్వాత వారు పరిష్కరిస్తారని బోర్డు తెలిపింది. -
నియామకాలకు ఎన్నికలతో సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జరుపుతున్న నియామక ప్రక్రియకు ఎన్నికలతో ఏ సంబంధం లేదని పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. ప్రక్రియకు ఎన్నికలు ఆటంకమవుతాయంటూ వస్తున్న పుకార్లను అభ్యర్థులు నమ్మవద్దని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల బందోబస్తుకు పోలీస్‌శాఖ మొత్తం అదే పనిలో ఉండటం వల్ల దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోవడం తప్పని, ప్రతీ జిల్లా ప్రధానకార్యాలయాల్లోనూ, కమిషనరేట్‌లోని సైనికాధికారులు ఈ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. నిర్ణీత తేదీల్లోనే ఈ పరీక్షలు నిర్వహించేలా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్లో ఎస్ఐ సంబంధిత విభాగాలకు మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో పోలీస్ అకాడమీలో శిక్షణ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించుకున్నట్టు తెలిపారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ముందు ప్రకటించినట్లు ఈ నెల 30న జరుగుతుందని వెల్లడించారు. ఎస్ఐ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు పూర్తయ్యేలోపు కానిస్టేబుల్ ఫిజికల్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. తుది పరీక్ష విçషయంలో కొంచెం సమయం పడుతుందని, శిక్షణకు అన్ని పోలీస్ శిక్షణ కేంద్రాలు, ట్రైనింగ్ కాలేజీలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియపై గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని, అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించారు. ఐటీ ఎస్ఐ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన కమ్యూనికేషన్, ఐటీ సబ్ఇన్స్పెక్టర్, ఫింగర్ ప్రింట్స్ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఐటీ, కమ్యూనికేషన్ విభాగంలో 4,684(33.62%)మంది, ఫింగర్ ప్రింట్ విభాగంలో 3,276(42.58%)మంది అర్హత సాధించారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే ఫిజికల్ టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. అర్హత పొందిన అభ్యర్థులు మార్కులు, ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్లో యూజర్‌ఐడీ ద్వారా లాగిన్ కావాలని సూచించారు. ఫిజికల్ టెస్టులకు సంబంధించి పార్ట్–2 దరఖాస్తు ఫారాన్ని త్వరలో వెబ్సైట్లో ఉంచుతామని, సూచించిన సమయంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
ఆగస్టులో ‘పోలీసు’ రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల (18,428 పోస్టులు) భర్తీకి సంబంధించిన రాత పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. టీ–శాట్ నెట్వర్క్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియామకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎనిమిది నెలల్లో నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏమైనా అనుమానాలుంటే బోర్డు హెల్ప్‌లైన్, వెబ్సైట్లో సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. -
పోలీసు ఉద్యోగ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాత పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పరిశీలకులు, సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, పరీక్షాకేంద్రాల సిబ్బందికి జేఎన్టీయూహెచ్లో మంగళవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న ఎస్ఐ సివిల్ విభాగానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, ఎస్ఐ కమ్యూనికేషన్స్ విభాగానికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న కానిస్టేబుల్ పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ, 25న ఎస్ఐ సీటీవో పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బయో ఇన్విజిలేషన్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నామని, తరువాత నిర్వహించబోయే దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలతో సరిపోల్చడం ద్వారా నకిలీల ఆట కట్టిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్లతో మాత్రమే పరీక్ష రాయాలని సూచించారు. అనంతరం పరీక్షల కో ఆర్డినేటర్ ఎన్.వి.రమణరావు, కో-కోఆర్డినేటర్ జి.కె.విశ్వనాథ్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బంది విధి విధానాల గురించి వివరించారు. పరీక్షలకు ముందు, తరువాత తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.