సాక్షి, హైదరాబాద్: పోలీసు కావడం కొందరి కల.. మరికొందరి ఆశ... ఇంకొందరి ఆశయం... సామాజిక, ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆసక్తి ఉన్నప్పటికీ అనేక మంది ఎంపిక పరీక్షలకు దూరంగా ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ పేరుతో ఉచిత శిక్షణ ఇస్తోంది. 2016లో పశ్చిమ మండలంలో ప్రారంభమైన ఈ విధానం 2018లో అయిదు సెంటర్లలో 5 వేల మందికి విస్తరించింది. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు ఈసారి నగరంలోని 11 సెంటర్లలో తొలి దశలో 7500 మందికి జరుగుతోంది. జేసీపీ ఎం.రమేష్, అదనపు డీసీపీ పరవస్తు మధుకర్‌స్వామి నేతృత్వంలో ఇవి సాగుతున్నాయి.
అనూహ్య స్పందనతో ఎంపిక పరీక్ష...
సబ్– ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ వంటి పోలీసు పరీక్ష హాజరవ్వాలనే ఆసక్తి, అర్హతలు ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడాన్ని నగర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా అన్ని అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తోంది. ఈ నేపథ్యంలో గణనీయమైన పోటీ ఏర్పడటంతో తొలిసారిగా ఎంపిక పరీక్ష నిర్వహించారు. మొత్తం 21 వేల మంది హాజరుకాగా వడపోత తర్వాత తొలి దశలో 7,500 మందిని ఎంపిక చేసి ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇండోర్ ట్రైనింగ్‌గా పిలిచే ఆంగ్ల, కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర సహా మొత్తం 12 అంశాలతో పాటు అవుట్ డోర్ ట్రైనింగ్ దేహ దారుఢ్యం, వ్యాయామం వంటివీ ఈ శిక్షణలో భాగంగా నిష్ణాతుల పర్యవేక్షణలో సాగుతున్నాయి.
పేదలకు ఉచితంగా భోజనం వసతి..
ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ సైతం అందించార. సిటీ పోలీసుల ప్రీ– రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్‌కు హాజరవుతున్న వారిలో నిరు పేదలూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ మండలంలోని ఆయా ప్రాంతాలకు చెందిన వారికి ఉచితంగా భోజన సౌకర్యాన్నీ కల్పించారు. మిగిలిన వారికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో రూ.5 భోజనం అందిస్తున్నారు. దేశ దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా ఆయా జోన్లలో ఉన్న గ్రౌండ్స్‌లో ప్రతి రోజూ ఉదయం దేహ దారుఢ్య పరీక్షలకు సంబంధించి 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లు గుర్తించి సరి చేస్తూ అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు.
ప్రతి వారం పరీక్షలు నిర్వహణ..
గతంలో జరిగిన పోలీసు శిబిరాల్లో శిక్షణ తీసుకుని ఎంపికైన వారి ద్వారానూ ఈ శిక్షణలు జరుగుతున్నాయి. అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు వారిలో ఉన్న లోపాలు గుర్తించడానికి ప్రతి ఆదివారం మాక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా వెనుకబడిన వారిని గుర్తిస్తున్నారు. వీరికి సంబంధించి ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టే ట్రైనర్లు అదనపు శిక్షణ ఇస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభాపాటవాలు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆశయం, కొత్వాల్ సీవీ ఆనంద్ ఆలోచనతోనే యువతకు ఈ అవకాశం వచ్చింది.
ప్రతి అభ్యర్థిపైనా ప్రత్యేక శ్రద్ధ
భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్‌లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నా. ఎస్సై, కానిస్టేబుల్ రెండు పోస్టులకు అప్లై చేశా. ట్రైనింగ్ కూడా ఆ కోణంలోనే సాగుతోంది. కాస్లులో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరి మీదా శ్రద్ధ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందిస్తున్నారు. సిటీ పోలీసులు పీఆర్టీ క్యాంప్‌లో ఇప్పటి వరకు చాలా సబ్జెక్టు నేర్చుకున్నా. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
– రిహానా, పరేడ్‌గ్రౌండ్స్ క్యాంప్ అభ్యర్థిని \టార్గెట్ 30 శాతం
నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు, సూచనల మేరకు పకడ్బందీగా శిక్షణ ఇస్తున్నాం. ప్రతి సబ్జెక్టును అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు బోధిస్తున్నారు. గతంలో నిర్వహించిన పీఆర్టీకి హాజరైన అభ్యర్థుల్లో 20 శాతం మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి కనీసం 30 శాతం మంది విజయం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నాం.
– పరవస్తు మధుకర్ స్వామి, అదనపు డీసీపీ
(చదవండి: జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా)
Comments
Please login to add a commentAdd a comment