telangana power department
-
TS:సీఎం ఆదేశించినా ఆబ్సెంట్..రివ్యూకు రాని ట్రాన్స్‌కో సీఎండీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని ప్రభాకర్‌రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. ఇదీచదవండి..జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు -
TS: ఉద్యోగుల ధర్నా.. ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్లరంగు చొక్కాలు ధరించి మహా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్‌శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్తా మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. చట్టసవరణ బిల్లు ప్రవేశ పెడితే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనతో తెలంగాణలో ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ఎవరు విధుల్లో ఉండరని ప్రకటించిన ఉద్యోగులు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు. చదవండి: Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
తెలంగాణ గ్రిడ్‌పై డ్రా‘గన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై చైనా నుంచి సైబర్ దాడులకు ప్రయత్నాలు జరుగు తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్ సిస్టంలతో ‘కమ్యూనికేట్’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశ సైబర్ భద్రత అవసరాల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2004లో ‘సీఈఆర్టీ–ఇన్’ను ఏర్పాటు చేసింది. సీఈఆర్టీ–ఇన్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్కోఅప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుంది. సీఈఆర్టీ–ఇన్ గుర్తించి పంపిన ‘చైనీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ల ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్‌లను ట్రాన్స్‌కో బ్లాక్ చేసింది. దీంతో చైనీస్ సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న ఈ సర్వర్లు.. ట్రాన్స్‌కో, ఎస్ఎల్డీసీకు చెందిన కంప్యూటర్ సిస్టంలతో కమ్యూనికేట్ కావడానికి దారులు మూసేసినట్టు అయింది. - హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఉన్న లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సబ్ స్టేషన్లలోని సర్క్యూట్ బ్రేకర్లను నియంత్రించే వ్యవస్థ పనిచేయకుండా తాత్కాలికంగా డిజేబుల్ చేసింది. దీంతో హాకర్లు రిమోట్ ఆపరేషన్ ద్వారా గ్రిడ్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి, కుప్పకూల్చడానికి అవకాశం లేకుండా పోయింది. - దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వెబ్‌సైట్‌కు సంబంధించి లాగిన్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది. - గ్రిడ్ భద్రతను కట్టుదిట్టం చేయడానికి .. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ (స్కాడా) కంట్రోల్ సెంటర్ పరిధి నుంచి అనుమాస్పద పరికరాలను దూరంగా తరలించి ఐసోలేట్ చేశారు. ప్రధానంగా చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరాలను గుర్తించి స్కాడా పరిధి నుంచి దూరంగా తరలించారు. రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ప్రమాదం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. నష్టమేంటి! సైబర్ నేరగాళ్లు మన విద్యుత్ సంస్థల కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడితే... మొత్తం సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలుగుతారు. గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కుప్పకూలితే విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అవుతుంది. కొన్ని గంటల పాటు కరెంటు ఉండదు. పరిస్థితి తీవ్రతను బట్టి ఈ సమయం పెరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. థర్మల్ పవర్స్టేషన్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. పునరుద్ధరించాలంటే ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. ఒకేసారి అన్ని యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. క్రమేపీ ఒక్కో యూనిట్‌ను స్టార్ట్ చేస్తూ... పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు అంటే? హాకింగ్, సైబర్ దాడుల కోసం సైబర్ నేరస్థులు వినియోగించే కంప్యూటర్లను ‘కమాండ్ అండ్ కంట్రోల్ (సీ అండ్ సీ) సర్వర్లు’అంటారు. ఈ సర్వర్ల నుంచి దాడులు చేయాల్సిన కంప్యూటర్లకు కమాండ్స్ (సాంకేతిక ఆదేశాలు) పంపించి డేటాను చోరీ చేయడం లేదా మొత్తం కంప్యూటర్ నెట్‌వర్క్‌ను తమ నియంత్రణలోకి తీసుకోవడం చేస్తుంటారు. సిస్టమ్స్‌లో మాల్వేర్ చొప్పించి ఈ దాడులకు పాల్పడుతారు. ఈ ప్రక్రియ అంతటికీ కమ్యూనికేట్ కావడమే కీలకం. ఒకసారి గనక సైబర్ నేరగాళ్లు మన వ్యవస్థలో ఒక సిస్టంతో సంబంధాలు నెలకొల్పుకోగలిగితే చాలు. ఆపై మొత్తం నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ముంబై తర్వాత టార్గెట్ హైదరాబాద్? చైనా నుంచి సైబర్ దాడుల ఫలితంగానే గతేడాది అక్టోబర్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలి ముంబై నగరం అంధకారమైందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సోమవారం సంచలన కథనం రాసింది. గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత భారత దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్న ఉద్దేశంతో చైనా ఈ సైబర్ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. మరుసటి రోజే సీఈఆర్టీ–ఇన్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చైనా నుంచి సైబర్ దాడులకు పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరికలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని ఎన్నో వ్యూహాత్మక సంస్థలకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని సైతం లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్ దాడులకు ప్రయత్నాలు చేసినట్టు తాజా హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి. అంతటా ఆటోమేషన్.. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ నుంచి విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) నిర్వహణ వరకు ప్రస్తుతం అంతటా ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కంప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో మన అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుంటారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ముందే మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలను సైబర్ నేరస్థులు హైజాక్ చేసి గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ముంబైలో గ్రిడ్ కూలిపోవడం వెనక ఇదే కారణమని చర్చ జరుగుతోంది. గతేడాది కేంద్రం హెచ్చరికలు విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యూహాత్మకమైన విద్యుత్ రంగాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. చైనా నుంచే అత్యధిక దిగుమతులు చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. -
జీతాలతో పనేముంది?
సాధారణంగా ఏ ఉద్యోగి అయినా నెల గడిచిందంటే జీతం డబ్బుల కోసం ఎదురుచూస్తారు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలోని కొందరు ఇంజినీర్లు మాత్రం ఇందుకు భిన్నం. వారికి జీతం డబ్బులతో పనిలేదు. అందుకే ఏడేళ్లుగా జీతమే డ్రా చేయడం లేదు. డిస్కం ఆపరేషన్ విభాగంలోని దాదాపు వంద మంది ఇంజినీర్లు గత ఏడేళ్లుగా వేతనాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో అందుతుండడంతో వీరు వేతనాల జోలికి వెళ్లడం లేదని, రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి ఈ వేతనాలు డ్రా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: కుటుంబం సాఫీగా గడవాలంటే...ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నెల జీతం తప్పని సరి. అయితే ఏళ్ల తరబడి వేతనం డ్రా చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఘనత ఒక్క దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లకు మాత్రమే దక్కింది. ఒకటి కాదు రెండు కాదు..ఒక్కొక్కరు ఏడెనిమిదేళ్లుగా వేతనాలు తీసుకోకుండా విధుల్లో కొనసాగుతుండటాన్ని పరిశీలిస్తే డిస్కంలో ఇంజినీర్ల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ విభాగంలో పని చేస్తున్న కొందరు ఇంజినీర్లకు నెలసరి వేతనంతో పోలిస్తే కొత్తలైన్లకు సంబంధించిన వర్క్ ఎస్టిమేషన్, వివిధ విద్యుత్ పనులకు అనుమతులు జారీ చేసినందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ల నుంచి లభించే కమీషన్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కమీషన్లకు జీతం తోడైతే..భారీగా ఆస్తులు జమై...అక్రమాస్తుల సంపాదన కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉండటంతో పలువురు ఇంజినీర్లు జీతం తీసుకోకుండా కేవలం కమీషన్లతోనే కుటుంబ అవసరాలు తీర్చడంతో పాటు భారీగా స్థిరాస్తులను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఉద్యోగ విరమణకు ముందు పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్ ఫైళ్లన్నీ క్లోజ్ చేస్తే..ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనం సహా అప్పటి వరకు సంస్థ నుంచి రావాల్సిన ఇతర బెనిఫిట్లన్నీ ఒకేసారి దక్కే అవకాశం ఉండటంతో కొందరు ఇంజినీర్లు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకుని, ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు ఈ కొత్త తరహా ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంస్థలో అక్రమార్జనపై ఆధారపడి, జీతం తీసుకోకుండా పనిచేస్తున్న ఇంజినీర్ల సంఖ్య వందకుపైగా ఉన్నట్లు అంచనా. అయితే వీరిలో ఇటీవల 15 మందిని గుర్తించిన యాజమాన్యం వారిని ఆయా విధుల నుంచి రిలీవ్ చేసినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ శాతం గ్రేటర్ శివారు ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్లే కావడం గమనార్హం. ఎల్పీసీ లేకుండా బదిలీలు..ఆపై పదోన్నతులు: కొత్తలైన్ల ఏర్పాటు, కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, లైన్‌షిఫ్టింగ్ వర్కులు, భూగర్భకేబుల్ వర్కులకు ఆయా సెక్షన్ పరిధిలోని ఏఈ, ఏడీఈ, డీఈలు అంచనాలు రూపొందిస్తారు. ఆ తర్వాత ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి, అర్హులైన వారికి పనులు అప్పగిస్తుంటారు. ఆయా పనులు పూర్తయిన తర్వాత ఆ పని చేసిన కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులు, స్టోర్స్ నుంచి తీసుకొచ్చిన డీటీఆర్లు, కండక్టర్, పోల్స్, కాసారాలు, మీటర్లు సహా ఇతర మెటిరీయల్‌కు సంబంధించిన పూర్తి బిల్లులను ఆడిట్ విభాగానికి అందజేయాల్సి ఉంది. ఒక వేళ పని పెండింగ్‌లో ఉన్నట్లైతే..అప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన పూర్తి బిల్లులను ఆడిట్ విభాగానికి అందజేయాలి. ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు, ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు ఉద్యోగి బదిలీపై వెళ్లినప్పుడు విధిగా లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్(ఎల్పీసీ) సమర్పించాల్సి ఉంది. ఒక వేళ వర్క్‌ను కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెడితే.. సంబంధిత సెక్షన్ ఉన్నతాధికారులు సదరు ఇంజినీర్లకు ఎల్పీసీ జారీ చేయకపోవడమేగాక నెల జీతం కూడా నిలిపివేస్తారు. వాస్తవానికి ఎల్పీసీ సమర్పించని ఇంజినీర్లకు బదిలీలు, పదోన్నతుల్లో అవకాశం కల్పించరాదు. కానీ డిస్కంలో లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ సమర్పించకుండా ఏళ్ల తరబడి జీతం కూడా తీసుకోకుండా పని చేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులు కట్టబెడుతుండటం వివాదాస్పదంగా మారుతోంది. సంస్థ పరిధిలోని ప్రతి ఉద్యోగి తాలుకూ సమాచారం సంబంధిత మానవ వనరుల విభాగం(హెచ్ఆర్)లో ఉంటుంది. ఏ ఉద్యోగి ఎం త కాలం నుంచి జీతం తీసుకోవడం లేదో ఇట్టే తెలిసిపోతుంది. అయితే డిస్కంలోని హెచ్ఆర్ విభాగం మాత్రం దీనిని చాలా చిన్న అంశంగా చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎల్పీసీలు సమర్పిం చని ఇంజినీర్లను నాన్పోకల్ పోస్టుల్లోకి బదిలీ చేయాలి. అయితే అక్రమార్జన కేసుల్లో ఇప్పటికే అరెస్టైన పలువురు ఇంజినీర్లను ఆపరేషన్ విభాగంలోని కీలకమైన ఫోకల్ పోస్టుల్లో కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది. బదిలీ ఆర్డర్స్ ఇచ్చినా అక్కడే: విద్యుత్ సంస్థల్లో ప్రతి మూడేళ్లకోసారి ఉద్యోగుల బదిలీలు చేపడతారు. నిబంధనల ప్రకారం ఒక సెక్షన్లో వరుసగా మూడేళ్ల పాటు పని చేసిన ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్ఈ, సీజీఎంలను ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తుంటారు. నిజానికి ఫోకల్ పోస్టుల్లో పని చేసిన వారిని, నాన్‌ఫోకల్ పోస్టుల్లోకి, ఆపరేషన్ విభాగంలో పని చేసిన వారిని ప్రాజెక్ట్ విభాగంలోకి బదిలీ చేయాల్సి ఉంది. అయితే డిస్కంలో ఇందుకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అక్రమార్జనకు అలవాటుపడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్లకు పోస్టుల కేటాయింపులో పెద్దపీఠ వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో మూడేళ్ల కంటే ఎక్కువగా పని చేస్తున్న కొందరు ఏఈలు, ఏడీఈలను గత ఏడాది యాజమాన్యం బదిలీ చేసింది. అయితే వారు ఇప్పటి వరకు అక్కడి నుంచి రిలీవ్ కాకపోవడాన్ని పరిశీలిస్తే డిస్కంలో బదిలీల పక్రియ ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే సర్కిల్లోని ఓ ఏఈ, మరో ఏడీఈ బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా యాజమాన్యం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. -
ఒప్పందాలు ముగిస్తే లాభమే
* విద్యుత్‌రంగంపై తెలంగాణ ఇంధనశాఖ నివేదిక * 2019తో ముగియనున్న పలు ఒప్పందాలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముగిసిపోతే తెలంగాణ ఎక్కువగా లాభపడుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం టీఎస్ జెన్కో, ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ పంపిణీ అవుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో ఒప్పందాల గడువు అయిదేళ్లలో ముగిసిపోనుంది. అప్పుడు ఏపీ జెన్కో ప్లాంట్ల నుంచి విద్యుత్ వాటా నిలిచిపోతుంది. అదే సమయంలో టీఎస్ జెన్కో ప్రాజెక్టులలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ నూరు శాతం తెలంగాణ సొంతమవుతుంది. దీంతో విద్యుత్ కొనుగోలు వ్యవహారాల్లో రాష్ట్రానికి దాదాపు రూ.275 కోట్లు ఆదా అవుతుందని ఇంధన శాఖ లెక్కలేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న విద్యుత్ లభ్యత వివరాలను.. 2019 మార్చి 31 నాటితో ముగిసే ఒప్పందాల అనంతరం ఉండే విద్యుత్ పరిస్థితిని ఇటీవలి టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఇంధనశాఖ ప్రత్యేకంగా పొందుపరిచింది. ప్రస్తుతం టీఎస్జెన్కో పరిధిలో థర్మల్, హైడల్ కేంద్రాల్లో మొత్తం 3,058 మెగావాట్ల విద్యుత్‌కు ఒప్పందాలు అమల్లో ఉన్నాయి. దీంతో తెలంగాణకు కేవలం 1,648 మెగావాట్ల కరెంటు అందుతోంది. ఒప్పందాల గడువు ముగిసిపోతే మొత్తం 3,058 మెగావాట్లు దక్కుతుంది. పీపీఏల ప్రకారం ఇప్పుడు లభ్యమవుతున్న విద్యుత్‌తో పోలిస్తే 1,410 మెగావాట్లు అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఒప్పందాలు ముగియటం వల్ల ఏపీ జెన్కో 1,757 మెగావాట్లు కోల్పోతుందని ఇంధన శాఖ లెక్కగట్టింది. దీనికి తోడు టీఎస్ జెన్కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే.. ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా నమోదవుతోంది. బొగ్గు గనులు అందుబాటులో లేకపోవటం, రవాణా భారం ఉత్పాదక వ్యయంలో యూనిట్‌కు 52 పైసల తేడా ఉంటుందని ఇంధన శాఖ గుర్తించింది. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్లాంట్లలో రూ.2.84 చొప్పున ఖర్చు అవుతుండగా... అదే యూనిట్‌కు ఏపీ జెన్కో పరిధిలో రూ.3.36 ఖర్చు అవుతుందని పోల్చి చెప్పింది. ఒప్పందాల గడువు ముగిసిపోతే తెలంగాణ ప్లాంట్ల నుంచి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్తును ఏపీ కోల్పోతుందని.. దీంతో అయిదు శాతం ఖర్చు అదనంగా భరించాల్సి వస్తుందని.. అదే సమయంలో తెలంగాణకు రూ.275 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేసింది. కొత్తగూడెం, రామగుండం(బి) థర్మల్ ప్లాంట్లు, నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్, ఆర్టీపీపీ స్టేజీ వన్, అప్పర్ సీలేరు, శ్రీశైలం కుడి కాల్వ, ఎడమ కాల్వ, నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్, కుడి కాల్వ, తమిళనాడులోని నైవేలి ప్లాంట్లతో ఇప్పుడున్న పంపిణీ ఒప్పందాలు 2019 మార్చి 31తో ముగియనున్నాయి.