Telangana public
-
కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో..!
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా అన్నివిధాలా ఆటంకం కలిగిస్తోందని.. అయినా మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధనదిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో పునర్నిర్మించుకుంటున్నామని.. నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాల్సిన సందర్భమని ప్రకటించారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటోందన్నారు. కేంద్రం సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు, రివార్డులు, ప్రశంసలే దీనికి సాక్ష్యమని తెలిపారు. పలు విధాలుగా పథకాలను అమలుచేస్తూ ఎనిమిదేళ్లలోనే ఊహించనంత సంక్షేమం, అభివృద్ధిని సాధించామన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్నిరంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతోందని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రజాసంక్షేమ పాలనను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. -
నిమ్స్ పనులను వేగవంతం చేయాలి
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీబీనగర్: తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం చేపట్టిన నిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంబంధిత నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్స్ట్రక్షన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ యూనివర్సిటీ భవనంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. అంతకుముందు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు నెలల్లో నిమ్స్ భవనంలోని బీ, డీ బ్లాక్‌ల నిర్మాణ పనులను పూర్తిచేసి వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్స్ విషయంలో అలసత్వం వహించకుండా అధికారులు ముమ్మరంగా పనులు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించామని, బకాయి ఉన్న రూ.34 లక్షల విద్యుత్ బిల్లును ట్రాన్స్‌కో శాఖకు చెల్లించినట్లు తెలిపారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. నిమ్స్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, నాగార్జున కాంట్రాక్ట్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, నాయకులు జడల అమరేందర్, పిట్టల అశోక్, గాదె నరేందర్‌రెడ్డి, కొల్పుల అమరేందర్, కొలను దేవేందర్‌రెడ్డి, పంజాల బాల్‌రాజు, రవికుమార్, కిరణ్‌కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు.