telangana revenue employees
-
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. మంగళవారం తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన ట్రెసా.. ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు చేసింది. సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించింది. శాఖలో పనిభారం ఎక్కువయిందని, వెంటనే కేడర్ స్ట్రెంగ్త్‌ను నిర్ధారించాలని, పదోన్నతులివ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ధరణి అంశాలను పరిష్కరించాలని, వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని కోరింది. తమ వినతి పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని, హామీల అమలుకు రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారని ట్రెసా ప్రతినిధులు వెల్లడించారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, నిర్మల, శ్రవణ్‌లతో పాటు పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ట్రెసా డైరీని ఆవిష్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)రెవెన్యూ డైరీని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతం కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నె ప్రభాకర్, నిరంజన్, బోనాల రామ్‌రెడ్డి, శైలజ, నిరంజన్ తదితరులు పాలొన్నారు. -
సకల ఉద్యోగుల మహాసభను జయప్రదం చేయాలి
సంగారెడ్డి రూరల్: హైదరాబాద్‌లో ఈ నెల 25న నిర్వహించే సకల ఉద్యోగుల మహాసభను జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై. శివప్రసాద్ పిలుపునిచ్చారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలో గురువారం సాయంత్రం అసోసియేషన్ సభ్యులతో కలిసి మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ అంశంతో ఉద్యోగులు భద్రత లేని బతుకులు వెల్లదీస్తున్నారన్నారు. జిల్లాల విభజనలో భాగంగా ఉద్యోగులు తమ అనుమతి లేకుండా జరిగిన బదిలీలతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించి అవసరమైన చోట ఖాళీలు భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. 11వ పే రివిజన్ కమిషన్‌ను వెంటనే నియమించి ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొమ్మరాములు, వీరేశం, బాల్‌రాజ్, వరప్రసాద్, శ్రీనివాస్, గుండేరావు, సయ్యద్‌ఉమర్‌పాష, కిరణ్‌కుమార్, అలీమ్, విశ్వేశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంపర్ బొనాంజా ప్రకటించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఏఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తం 35,749 మందికి ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాసు పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్ లో శనివారం సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.’ అని అభినందించారు. ‘దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. భూరికార్డులు గందరగోళంగా మారిన పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి, పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్న రైతులతో పాటు, అసైన్డ్ దారులన కూడా ఓ కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా భూములు కూడా క్లియర్ అయ్యాయి. ఇది సాధారణ విషయం కాదు. దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం’ అని సీఎం ప్రకటించారు. -
'సీఎం చెప్పినట్లు అధికారులు వ్యవహరించడం లేదు'
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా... అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో శివశంకర్ మాట్లాడుతూ... ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా అధికారులు వ్యవహరించడం లేదని విమర్శించారు. పథకాల అమలు కోసం ఉన్నతాధికారులు కింద స్థాయి సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని శివశంకర్ అభిప్రాయపడ్డారు.