నిజాంషుగర్స్ ఆంధ్రవాళ్ల చేతిలో ఎందుకు?
బోధన్ టౌన్ : తెలంగాణ పాలనలో ఆంధ్ర వాళ్ల చేతిలో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని ఎందుకు ఉండనిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఆంధ్రలో బంధువులు ఉన్నారా? లేక ఆయన రక్తం ఆంధ్రాలో ఉందా అని అన్నారు. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ కుటంబ సభ్యులు ఇచ్చి న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం పట్టణంలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో పర్యటించి సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం ఫ్యాక్టరీని ప్రైవేట్ యా జమాన్యం చేతిలో నుంచి లాక్కొని ప్రభుత్వం స్వా ధీనం చేసుకుంటుదని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
అలాగే రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత అధికారం వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అక్కడి కార్మికులకు హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు గడుస్తున్నా వారు ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఊసే ఎత్తక పోవడం సిగ్గు చేటన్నారు.