కొండపై కోట.. కోటలో కోనేరు..!
మంగపేట సమీపంలో ప్రాచీన ఆనవాళ్లు
సుమారు 30 కిలోమీటర్ల పొడవైన రాతిగోడ
గుట్టలపై విశాలమైన చెరువులు
సాక్షి, భూపాలపల్లి/మంగపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం మల్లూరు సమీపంలోని కొండల్లో భారీ కోట ఒకటి వెలుగు చూసింది. ఇందులో 30 కిలోమీటర్ల పొడవైన ప్రహరీ, నీటి నిల్వల కోసం గొలుసుకట్టు పద్ధతిలో కోనేరులు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సభ్యులు ఇక్కడ పర్యటించగా భారీ గోడ కనిపించింది. అనంతరం ‘సాక్షి’ బృందం ఈ గుట్టపై పర్యటించి కోటకు సంబంధించిన ఆనవాళ్ల వివరాలు సేకరించింది.
కొండపై అందమైన కోట..
మంగపేట మండలంలోని మల్లూరు నుంచి మణుగూరు వెళ్తుంటే భారీ కొండలు కనిపిస్తాయి. రమణక్కపేటకు సమీపంలో ఎర్రమ్మతల్లి తోగు నుంచి కొండపైకి ఎక్కాలి. 5 కిలోమీటర్ల దూరం పైకి ప్రయాణించిన తర్వాత కొండ అంచు వెంబడి ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మించిన రాళ్ల బాట ఎదురవుతుంది. ఈ దారి వెంట ప్రయాణిస్తే ఏడు దర్వాజాల కోటగా పిలుస్తున్న ప్రాంతంలోకి ప్రవేశించవచ్చు. అక్కడ పెద్ద బండరాళ్లతో నిర్మించిన పురాతన రాతిగోడ కనిపిస్తుంది. దాటుకుని లోపలికి వెళ్తే కోనేరుగా భావిస్తున్న భారీ గొయ్యి ఇతర నిర్మాణాలు కనిపిస్తాయి.
కోట చుట్టూ నీటి నిల్వలు..
కోటలో నివసించే వారి నీటి అవసరాల కోసం కొండపై జలాశయాలు నిర్మించారు. ప్రహరీ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఎండిపోయిన జలాశయం కనిపించింది. ఈ చెరువు నిండి పొర్లిపోయే నీటిని ఒడిసి పట్టేందుకు దిగువన కిలోమీటరు దూరంలో మరో చిన్న జలాశయం కనిపిస్తుంది. వీటిని స్థానికులు దర్వాజాల కోట పెద్దచెరువు, చిన్నచెరువని పిలుస్తారు. ఈ రెండూ గూగుల్ మ్యాప్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా నిండిన తరువాత 15 కిలోమీటర్ల దూరంలో అరిశెలగండిలో నీరు కలుస్తుంది. ఈ గండి నుంచి చివరగా నీళ్లు గోదావరిలో కలుస్తాయి.
7వ శతాబ్దం నాటి కోట, ఆలయం..?
మల్లూరులో హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంది. హేమచలక్షేత్ర మహత్యం అనే పుస్తకంలో ఈ కోటకు సంబంధించిన పలు విశేషాలు పొందుపరిచారు. సరైన ఆధారాలు లేకపోయినా 7, 8, 9వ శతాబ్దం లేదా ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించి ఉండవచ్చని ఆ పుస్తకంలో అంచనా వేశారు. కాకతీయుల పతనం అనంతరం ఈ కోట నుంచి చీనాబ్ఖాన్ పరిపాలించాడు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన కొండమర్సు నేతృత్వంలోని సైనిక పటాలము చీనాబ్ఖాన్పై దాడిచేసి ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి వల్ల కోటలో కొంతభాగం ధ్వంసమైంది. కాలక్రమంలో ఈ కోట, ఆలయ ప్రాభవం మరుగున పడిపోయాయి. 18వ శతాబ్దంలో వెలమ దొరల కాలంలో మల్లూరు ఆలయం వెలుగులోకి వచ్చింది.
మరింత పరిశోధిస్తే..
ఇప్పటివరకు పరిశోధకులు కోటకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించలేదు. తాము చూసిన ప్రదేశాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం రాతిగోడ సుమా రు 30 కి.మీ. ఉంటుందని అంచనా. తెలంగాణ పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ప్రోత్సాహంతో తెలంగాణ సోషల్ మీడియా ఫోరం చేపట్టిన పర్యటనతో దర్వాజ గుట్టలు వెలుగులోకి వచ్చాయి. హేమాచలం, కోపిరిగుట్ట, ముసలమ్మగుట్ట, దర్వాజాల గుట్టలపై మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశముంది.