మొహమ్మద్ అలీకి మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో మొహమ్మద్ అలీ, వరుణి జైశ్వాల్ సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అలీ 3, వరుణి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ జూనియర్, యూత్ బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన జూనియర్ బాలుర ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీ స్టేడియం) 11–9, 11–9, 11–6, 11–6తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలుపొందాడు. యూత్ బాలుర ఫైనల్లోనూ మొహమ్మద్ అలీ 11–8, 11–5, 11–6, 11–8తో అమాన్ ఉల్ రెహమాన్ (స్టాగ్ అకాడమీ)ని ఓడించి విజేతగా నిలిచాడు.
పురుషుల టైటిల్ పోరులో అలీ 11–2, 13–11, 11–9, 11–9తో మనోహర్ కుమార్‌పై గెలుపొందాడు. మరోవైపు జూనియర్ బాలికల ఫైనల్లో వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం) 5–11, 13–11, 11–8, 11–2, 6–11, 6–11, 11–9తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై, యూత్ బాలికల ఫైనల్లోనూ ఆమె 13–11, 11–7, 13–11, 11–6తో జి. ప్రణీతపైనే గెలుపొందింది. మహిళల ఫైనల్లో నైనా జైశ్వాల్ (ఎల్బీ స్టేడియం) 11–7, 11–5, 10–12, 9–11, 11–5, 11–8తో ప్రణీత (హెచ్‌వీఎస్)ను ఓడించింది. సబ్ జూనియర్ బాలికల విభాగంలో అంజలి (ఎంఎల్ఆర్) 11–6, 12–10, 5–11, 11–9, 3–11, 11–7తో భవిత (జీఎస్ఎం)పై గెలుపొందగా, బాలుర విభాగంలో వరుణ్ శంకర్ 14–12, 11–9, 11–8, 11–9తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)ను ఓడించాడు.