Telangana State Special Police
-
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్‌లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
అడ్డాకూలీలుగా టీఎస్ఎస్పీ అభ్యర్థులు
సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం తాళ్లసింగారానికి చెందిన జటంగి వెంకన్న (27) పంతంగి నరేశ్ (22) ఇటీవల టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. పనిమీద బైకుపై వెళ్తుండగా.. కారు ఢీకొట్టడంతో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి.. శిక్షణ కోసం ఎంతకీ పిలుపు రాకపోవడంతో జీవనోపాధి కోసం కూలీగా మారాడు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లుగా ఎన్నికైన పలువురు అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాదిమంది తాము చేస్తోన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామాచేసి శిక్షణ కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎంతకీ పిలుపు రాక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగి, పలువురు అడ్డాకూలీలుగా మారుతున్నారు. ఇంకొందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. వీరిలో ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరి కొందరు అభ్యర్థులు గాయాలు, అనారోగ్యాల బారినపడి శిక్షణకు పనికిరాకుండా మారా రు. అధికారులు సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లతోపాటు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకూ శిక్షణ ప్రారం భించి ఉంటే అంతా సురక్షితంగా ఉండేవారని అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు. వ్యవసాయ, అడ్డా కూలీలుగా.. రాష్ట్రవ్యాప్తంగా 17వేలకుపైగా సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు రాతపరీక్షల అనంతరం 2019 సెప్టెంబరు 24న ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైనవారిలో దాదాపు 4,200 మంది అభ్యర్థులు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులు. ఈ ఏడాది జనవరి 17న దాదాపు 12వేల మంది సివిల్, ఏఆర్ అభ్యర్థులకు కానిస్టేబుల్ శిక్షణ మొదలైంది. వీరికి మొదటి సెమిస్టర్ పూర్తయి, రెండో సెమిస్టర్ పాఠాలూ నడుస్తున్నాయి. కానీ, టీఎస్ఎస్పీ అభ్యర్థులకు 6నెలలుగా ఎలాంటి పిలుపూలేదు. అక్టోబరు 12 తరువాతే అవకాశం? రాతపరీక్షల్లో ఎంపికైన మొత్తం 17వేల మంది అభ్యర్థులుకు ఏకకాలంలో శిక్షణ ప్రారంభించాలని పోలీసుశాఖ భావించింది. వీరిలో 12వేల మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు రాష్ట్రంలో, మిగిలిన 4,200 మంది టీఎస్ఎస్పీ పీసీ కేడెట్లకు ఆంధ్రపదేశ్‌లో శిక్షణ ఇద్దామనుకున్నారు. సాంకేతిక కారణాలతో వీరిని ఏపీకి పంపడం కుదరలేదు. దీంతో కర్ణాటక, మధ్యప్రదేశ్‌కు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టగానే.. కరోనా కలకలం రేగింది. ఇప్పుడు జూన్ కూడా గడిచిపోతోంది. మరోవైపు సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుకు మొదటి సెమిస్టర్ పూర్తయింది. అక్టోబరు తొలి వారంలో వీరి శిక్షణ పూర్తయి పాసిం గ్ ఔట్ పరేడ్ జరగనుంది. ఆ తరువాత టీఎస్ఎస్పీ అభ్యర్థులకు శిక్షణ మొదలు కానుందని సమాచారం. -
టీఎస్ఎస్పీలో ప్రమోషన్ల గలాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో ఇప్పుడు పదోన్నతల గలాటా రేగుతోంది. ప్రమోషన్ల విషయంలో జనరల్ విభాగానికి మిగిలిన విభాగాలకు మధ్య దూరం చెరిపేస్తూ అమలు చేయాలని చూస్తోన్న కొత్త విధానం ఉద్యోగుల మధ్య చిచ్చుపెడుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగిపోయింది. తమకు రావాల్సిన ప్రమోషన్లను ఇతరులు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమని జనరల్ విభాగాల ఉద్యోగులు అంటుంటే.. తాము కూడా న్యాయపోరాటానికి వెనుకాడమని ఇతర విభాగాల సిబ్బంది అంటున్నారు. దీంతో ఈ వివాదం రోజురోజుకు ముదిరేలా కనిపిస్తోంది. అసలేంటి వివాదం.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభాగం (అప్పట్లో ఏపీఎస్పీగా వ్యవహరించేవారు) ఒక వెలుగు వెలిగింది. టీఎస్ఎస్పీలో మొత్తం 13 బెటాలియన్లు ఉండగా దాదాపుగా 13వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. టీఎస్ఎస్పీలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ విభాగం వీరిని గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్, స్పెషల్ ఆపరేషన్స్, కూంబింగ్ ఒకటేమిటి.. దాదాపుగా క్లిష్టమైన అన్ని ఆపరేషన్లకు ఉపయోగించేవారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గాక వీరి పేరు వినిపించడం కాస్త తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆక్టోపస్, ఎస్ఐబీ, కూంబింగ్‌కు వీరినే వినియోగిస్తున్నారు. వీరు నిత్యం ప్రాణాలకు తెగించి, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టులపై పోరులో చనిపోయిన పోలీసుల్లో సింహభాగం వీరే కావడం గమనార్హం. వీరి తరువాత మోటార్ ట్రాన్స్పోర్ట్, బ్యాండ్, ఆర్మర్ అనే మూడు విభాగాలు ఉంటాయి. వీరికి రిస్క్ తక్కువ. కాబట్టి డిపార్ట్మెంట్ పదోన్నతుల విషయంలో వీరికన్నా జూనియర్లయినప్పటికీ.. జనరల్ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అధికారులు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చక్రం తిప్పుతున్న అధికారులు.. కానీ, ఇపుడు అన్ని విభాగాలు ఒకటేనని అందరికీ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలన్న అంశాన్ని ఓ ఉన్నతాధికారి తెరపైకి తీసుకువచ్చారు. దీంతో తేనెతుట్టెను కదిపినట్లయింది. విధి నిర్వహణలో మాకు రిస్క్ అధికంగా ఉన్నందునే మాకు పదోన్నతుల్లో పెద్దపీట వేస్తున్న విషయం వాస్తవం. కానీ, ఆఫీసులో కూర్చుని పనిచేసే వారిని, మమ్మల్ని ఒకేగాటిన కడితే ఊరుకునేది లేదని జనరల్ విభాగాల ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ, కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. దాదాపు నాలుగు దశాబ్దాలక్రితం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.69 లో పేర్కొన్న ఓ అంశం ఆధారంగా సదరు అధికారులు .. నోషనల్ సీనియారిటీ ఆధారంగా ఎంటీ, బ్యాండ్, ఆర్మరీ విభాగాలకు చెందిన పలువురి పేర్లతో ఇప్పటికే పదోన్నతుల జాబితాను సిద్ధం చేశారు. దీంతో జనరల్ విభాగం వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ వివాదాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
మీ త్యాగమే దేశ భవిష్యత్తుకు పునాది
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు కోసం పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, వారి భుజస్కంధాల మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమిలో శిక్షణ పూర్తి చేసుకున్న 11వ బ్యాచ్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లు(ఎస్ఐ), 10వ బ్యాచ్ రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరైన గవర్నర్ నరసింహన్ ట్రైనీ ఎస్ఐల గౌరవ వందనం స్వీకరించారు. ఒక్క మహిళకు కూడా ఈ బ్యాచ్‌లో చోటు లేకపోవడం విచారకరమన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి పోలీసులు లాఠీ పట్టుకొని శాంతిభద్రతలు చూడటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని గవర్నర్ సూచించారు. హైటెక్ నేరాలు, కమ్యూనిటీ వివాదాలు ప్రతీ ఒక్కటీ అభివృద్ధికి ముడిపడే ఉంటుందన్నారు. రోజు రోజుకు నేరాల సంఖ్య, జరుగుతున్న విధానాలు కూడా మారుతున్నాయంటూ నరసింహన్ ఉదహరించారు. సైబర్ నేరాలు, బ్యాంకిగ్ వంటి మోసాలపై ఎక్కువగా దృష్టిసారించాలన్నారు. అందుకు తగ్గట్లుగా పోలీసు లు కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానంపట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీసు ప్రతిష్ట స్టేషన్‌హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో) మీద ఆధారపడి ఉంటుందన్నారు. పోలీసులకు అన్ని విధాల అండగా ఉండే ప్రభుత్వం ఉడటం చాలా శుభకరమన్నారు. పోలీసుల పట్ల సమాజ వైఖరి కూడా మారాలని గవర్నర్ కోరారు. పండుగలు, నూతన సంవత్సరం తదితర సందర్భాలలో కనీస కృతజ్ఞతలు తెలపాలనే స్పృహ సమాజానికి ఉండాలన్నారు. పోలీసుశాఖలోకి ఉన్నత విద్యావంతులు రావడం మంచి పరిణామమని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ట్రైనీల్లో 142 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 44 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. 59 మంది 20 ఏళ్ల వయస్సుగల వారే ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు. బహుమతుల ప్రదానం.. శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో నైపుణ్యం సాధించిన ఎస్ఐలకు గవర్నర్ నరసింహన్ బహుమతులు అందజేశారు. సివిల్ విభాగానికి సంబంధించి అన్ని రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి అందజేసే ముఖ్యమంత్రి రివాల్వర్ అవార్డును వరంగల్ రేంజ్‌కు చెందిన ఎన్.స్వరూప్‌రాజ్‌కు లభించింది. హోంమంత్రి ట్రోఫీ కూడా ఎన్.స్వరూప్రాజ్కే లభించింది. డీజీ, ఐజీపీ ట్రోఫీ అవార్డును హైదరాబాద్ రేంజ్‌కు చెందిన ఎం.లక్ష్మయ్య అందుకున్నారు. ఫైరింగ్ విభాగంలో డెరైక్టర్ ట్రోఫీని హైదరాబాద్ రేంజ్‌కు చెందిన కె.రాజుకు లభించింది. ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగానికి సంబంధించి ముఖ్యమంత్రి రివాల్వర్ అవార్డుతోపాటు హోంమంత్రి ట్రోఫీని ఎన్.రాజేశ్ గెలుపొందారు. డీజీపీ ట్రోఫీ కె.శ్రీనివాసరావుకు లభించింది. ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచినవారికి అందజేసే డెరైక్టర్స్ ట్రోఫీని ఎస్కె.నాగుల్‌మీరా కైవసం చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) విభాగంలో ముఖ్యమంత్రి రివాల్వర్ అవార్డును జి.గురుమూర్తి గెలుపొందారు. హోంమంత్రి ట్రోఫీని కె.త్రిముఖ్కు లభించింది. డీజీపీ ట్రోఫీని జి.గురుమార్తి గెలుపొందారు. ఫైరింగ్ విభాగంలో అందజేసే డెరైక్టర్ ట్రోఫిని ఎస్.శ్రీనివాసులు కైవసం చేసుకున్నారు.