సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ)లో ఇప్పుడు పదోన్నతల గలాటా రేగుతోంది. ప్రమోషన్ల విషయంలో జనరల్ విభాగానికి మిగిలిన విభాగాలకు మధ్య దూరం చెరిపేస్తూ అమలు చేయాలని చూస్తోన్న కొత్త విధానం ఉద్యోగుల మధ్య చిచ్చుపెడుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగిపోయింది. తమకు రావాల్సిన ప్రమోషన్లను ఇతరులు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమని జనరల్ విభాగాల ఉద్యోగులు అంటుంటే.. తాము కూడా న్యాయపోరాటానికి వెనుకాడమని ఇతర విభాగాల సిబ్బంది అంటున్నారు. దీంతో ఈ వివాదం రోజురోజుకు ముదిరేలా కనిపిస్తోంది.
అసలేంటి వివాదం..
ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభాగం (అప్పట్లో ఏపీఎస్పీగా వ్యవహరించేవారు) ఒక వెలుగు వెలిగింది. టీఎస్‌ఎస్‌పీలో మొత్తం 13 బెటాలియన్లు ఉండగా దాదాపుగా 13వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. టీఎస్‌ఎస్‌పీలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ విభాగం వీరిని గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, ఆక్టోపస్, స్పెషల్ ఆపరేషన్స్, కూంబింగ్ ఒకటేమిటి.. దాదాపుగా క్లిష్టమైన అన్ని ఆపరేషన్లకు ఉపయోగించేవారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గాక వీరి పేరు వినిపించడం కాస్త తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆక్టోపస్, ఎస్‌ఐబీ, కూంబింగ్‌కు వీరినే వినియోగిస్తున్నారు. వీరు నిత్యం ప్రాణాలకు తెగించి, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టులపై పోరులో చనిపోయిన పోలీసుల్లో సింహభాగం వీరే కావడం గమనార్హం. వీరి తరువాత మోటార్ ట్రాన్స్‌పోర్ట్, బ్యాండ్, ఆర్మర్ అనే మూడు విభాగాలు ఉంటాయి. వీరికి రిస్క్ తక్కువ. కాబట్టి డిపార్ట్‌మెంట్ పదోన్నతుల విషయంలో వీరికన్నా జూనియర్లయినప్పటికీ.. జనరల్ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అధికారులు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.
చక్రం తిప్పుతున్న అధికారులు..
కానీ, ఇపుడు అన్ని విభాగాలు ఒకటేనని అందరికీ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలన్న అంశాన్ని ఓ ఉన్నతాధికారి తెరపైకి తీసుకువచ్చారు. దీంతో తేనెతుట్టెను కదిపినట్లయింది. విధి నిర్వహణలో మాకు రిస్క్ అధికంగా ఉన్నందునే మాకు పదోన్నతుల్లో పెద్దపీట వేస్తున్న విషయం వాస్తవం. కానీ, ఆఫీసులో కూర్చుని పనిచేసే వారిని, మమ్మల్ని ఒకేగాటిన కడితే ఊరుకునేది లేదని జనరల్ విభాగాల ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ, కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. దాదాపు నాలుగు దశాబ్దాలక్రితం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.69 లో పేర్కొన్న ఓ అంశం ఆధారంగా సదరు అధికారులు .. నోషనల్ సీనియారిటీ ఆధారంగా ఎంటీ, బ్యాండ్, ఆర్మరీ విభాగాలకు చెందిన పలువురి పేర్లతో ఇప్పటికే పదోన్నతుల జాబితాను సిద్ధం చేశారు. దీంతో జనరల్ విభాగం వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ వివాదాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
టీఎస్‌ఎస్‌పీలో ప్రమోషన్ల గలాట
Published Sun, Aug 11 2019 1:35 AM | Last Updated on Sun, Aug 11 2019 1:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment