సంబరం.. ‘సంక్షేమ’ం
► నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు
► నూతన పథకాలకు శ్రీకారం
► బాలింతలకు కేసీఆర్ కిట్టు..
► ఒంటరి మహిళలకు పింఛన్
► గుడుంబా తయారీ కుటుంబాలకు పునరావాసం
► హోంగార్డుల సేవలకు గుర్తింపు
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందుకు కొత్త పథకాలను తీసుకొస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతోపాటు వివిధ వర్గాలకు చేయూతనిచ్చేందుకు కొత్త పథకాలను ప్రారంభించనుంది. అమ్మఒడి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్లు, గుండుంబా తయారీ కుటుంబాలకు పునరావాసం వంటి పథకాలకు శ్రీకారం చుట్టనుంది.
దీంతో ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో వేడుకలను అంబరాన్నంటేలా జరిపించేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయిచింది. ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించడం, జాతీయ పతాక ఆవిష్కరణ, ఆస్పత్రులు, ఆశ్రమాల్లో పండ్ల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
కేసీఆర్ కిట్టు..
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 3న ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు బాలింతలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ కిట్టును అందజేయనున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవించే ఒక్కో బాలింతకు రూ.12 వేలు విలువ చేసే కేసీఆర్ కిట్టును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆడపిల్ల పుడితే అదనంగా రూ.వెయ్యి అందజేస్తారు.
దీనికి సంబంధించి నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులను వేసే విధంగా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని గర్భిణుల బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. వైద్య పరీక్షల సమయంలో రూ.4 వేలు, ప్రసవ సమయంలో రూ.4 వేలు, పిల్లలకు అందించే టీకాల సమయంలో రూ.4 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. కాగా కేసీఆర్ కిట్టులో సబ్బులు, పౌడర్, దోమతెర వంటి 12 రకాల వస్తువులను బాలింతలకు అందజేస్తారు.
ఒంటరి మహిళలకు పింఛన్లు
కుటుంబ సభ్యుల ఆదరణ కరువై ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం వారికి నెలవారీ పింఛన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆసరా పింఛన్ పథకంలోనే ఒంటరి మహిళలకు సైతం నెలకు రూ.వెయ్యి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 4న పింఛన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. కాగా జిల్లాలోని 13 మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో 1,605 మంది ఒంటరి మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి తొలివిడతగా ఏప్రిల్, మే నెలకు సంబంధించిన రూ.2 వేలు పంపిణీ చేయనున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 4న పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పునరావాస పథకం..
ఈ ఏడాది ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నారు. గుడుంబా తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందజేయనున్నారు. గుడుంబా మానేసిన వారికి రూ.2 లక్షలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిన అధికారులు జూన్ 2న పునరావాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసేందుకు సిద్ధమవుతున్నారు.అమ్మఒడి, ఒంటరి మహిళ పింఛన్లు, పునరావాస పథకంలాగే ప్రభుత్వం ఈ ఏడాది గొల్లకుర్మలకు ప్రభుత్వం 75 శాతం రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ చివరి వరకు తొలివిడతగా గొర్రెలు పంపిణీ చేయనున్నారు.
ఇప్పటికే గొల్లకుర్మ సంఘాలను గుర్తించారు. ఇప్పటి వరకు 150 సంఘాలు ఏర్పడగా 6 వేల వరకు సభ్యులు ఉన్నారు. తొలివిడతగా 3 వేల మంది లబ్ధిదారులకు జూన్ చివరిలోగా అందించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆవిర్భావ వేడుకలకు కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రత్యేకను సంతరించుకున్నాయి. గతేడాది వేడుకల్లో సాంస్కృతిక, ఇతర ప్రదర్శన కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది సంక్షేమ పథకాలపై దృష్టి సారిచింది. ఇందులో ముఖ్యమైన పథకాలు కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్ పథకాలు మహిళలకు ఎంతగానో లబ్ధి చేకూర్చనున్నాయి.
నిరంతర సేవలకు గుర్తింపు..
జిల్లాలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న నిరంతర సేవకులైన హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచనుంది. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు హోంగార్డుల వేతనాలు పెంచిన కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ కానుకగా మరోసారి వేతనాలు పెంచేందుకు నిర్ణయించారు. రూ.6 వేల ఉన్న వేతనాన్ని రూ.12 వేలుకు పెంచింది. ఈ ఏడాది ఆవిర్భావం రోజు రూ.19,884కు పెంచేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 900, ఆదిలాబాద్లో 300 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు.
సంతోషంగా ఉంది..
హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది. హోంగార్డుల కష్టాలను గుర్తించి ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ వేతనాలు పెంచడం జరిగింది. మళ్లీ ఆవిర్భావం సందర్భంగా వేతనాలుపెంచేందుకు నిర్ణయించడం పట్ల కృతజ్ఞతలు.
– హైదర్ఖాన్, హోంగార్డు