3 దశలుగా ‘గ్రిడ్’ టెండర్లు
తాజాగా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) టెండ ర్ల ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మొత్తం 26 ప్యాకేజీలకుగానూ తొలి దశ పనుల (11ప్యాకేజీల)కు గత నెల 23న నోటిఫికేషన్ జారీ చే యగా మిగిలిన విడతల టెండర్ల ప్రక్రియ (15ప్యాకేజీ)లకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. 2015-16కుగాను స్టాండర్డ్ షెడ్యూలు రేట్లు మారడంతో తొలి విడత టెండర్ల షెడ్యూలును గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సవరించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత షెడ్యూలు ప్రకారం గత నెల 27 నుంచి టెండర్లు స్వీకరించాల్సి ఉండగా కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల కారణంగా ఆ ప్రక్రియను అధికారులు అర్ధంతరంగా నిలిపేశారు. తాజా షెడ్యూలు మేరకు ఈ నెల 7 నుంచి 21 వరకు ఆన్లైన్లో టెండరు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే 22న టెక్నికల్ బిడ్లను, 25న ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలిస్తామని, ఈ నెలాఖరులోగా టెండర్లను ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.
ప్యాకేజీల్లో స్వల్ప మార్పులు...
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 34,568 కోట్లుగా నిర్ధారించిన అధికారులు ఈనెల 23న తొలి దశ కింద 11 ప్యాకేజీలకుగానూ రూ.15,987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్లు స్వీకరించేలోగా ఎస్ఎస్ఆర్ రేట్లు మారడంతో ఆయా ప్యాకేజీల అంచనాలను మార్చాల్సి వచ్చింది. మారిన రేట్లతో ప్రాజెక్ట్ వ్యయం రూ. 100 కోట్లు తగ్గినట్లు (రూ. 15,887 కోట్లే) అధికారులు ప్రకటించారు. గతంలో కంటే ఇనుము ధర బాగా తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కొన్ని ప్యాకేజీలకు సంబంధించి అంచనాలు యథాతథంగా ఉన్నాయని తెలిపారు. స్టీల్ ధర తగ్గినదానికి, ఇతర సామాగ్రి ధర పెరిగినదానికి సరిపోయిందని ముఖ్య అధికారి ఒకరు తె లిపారు. సీఎం సొంత జిల్లాలోని ప్యాకేజీ (మెదక్-గజ్వేల్)కి గతంలో రూ. 700 కోట్లతో అంచనాలు వేసిన అధికారులు ఆ ప్యాకేజీని తాజాగా రూ. 600 కోట్లకు కుదించారు.
11 ప్యాకేజీలు, వాటి అంచనా వ్యయాలు
ప్యాకేజీ పేరు వ్యయం(రూ.కోట్లలో)
మహబూబ్‌నగర్-శ్రీశైలం 5,953.00
మెదక్-జూరాల 700.00
రంగారెడ్డి- మేడ్చల్ 160.00
నల్లగొండ-ఏకేబీఆర్ 2,106.00
నల్లగొండ- ఎన్ఎస్పీ/టెయిల్‌పాండ్ 1,485.00
మెదక్-సంగారెడ్డి 680.00
మెదక్- గజ్వేల్ 600.00
అదిలాబాద్-ఎల్లంపల్లి-కడెం 670.00
వరంగల్-పాలేరు 1,700.00
వరంగల్-హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ 840.00
ఖమ్మం-పాలేరు 993.00
మొత్తం 15,887.00