662 వర్క్ ఇన్‌స్పెక్టర్లు,
47 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులకు ఓకే
హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం ఈ మేరకు సర్క్యులర్ జారీచేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47 మంది జూనియర్ అసిస్టెంట్లను, 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను సర్కారు ఆదే శించింది.
ఉద్యోగాలకు అర్హతలు ఇలా..
ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం డిప్లొమా అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 26 పోస్టులను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్‌లో రెగ్యులర్ ఇంజనీర్ల వాహనాలకు అదనపు ఇంధనాన్ని ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు నెలవారీగా ఉన్న 160 లీటర్ల పరిమితిని 250 లీటర్లకు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
వాటర్‌గ్రిడ్‌లో 709 తాత్కాలిక ఉద్యోగాలు
Published Wed, Aug 19 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement
Advertisement