ఆంధ్ర ఉద్యోగులకు జీతం కట్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్, ప్రాంతీయ పరిశోధనా సంస్థల సిబ్బందికి జూలై నెల జీతాలు అందలేదు. ఎందుకు ఇవ్వలేదో.. ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రపదేశ్ తన దామాషా కింద యూనివర్సిటీకి 58 శాతం నిధులను విడుదల చేయని కారణంగానే సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు రాలేదని అంటున్నారు. అయితే విభజన బిల్లులోని 10వ షెడ్యూల్లో పొందుపరిచిన రాష్ట్ర విద్యా సంస్థల కేంద్రాలు ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రమే నాలుగు నెలల పాటు జీతభత్యాల ఖర్చులు భరించాలంటూ అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ మేరకు రామన్న గూడెం కేంద్రంగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీకి, తిరుపతి కేంద్రంగా ఉన్న పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో పని చేస్తున్న సిబ్బందికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆంధ్రప్రాంతంలోని కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లించడంలేదు. విభజన బిల్లు 10వ షెడ్యూలులో ఈ యూనివర్సిటీ పేరు లేదు కాబట్టి జీవో 88 తమకు వర్తించదని వాదిస్తోంది. సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ తన దామాషా కింద 58 శాతం నిధులను కేటాయించాలని మెలిక పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ నిష్క్రియాపరత్వం వల్లే తమకు జీతాలు అందని పరిస్థితి వచ్చిందని సిబ్బంది విమర్శిస్తున్నారు.