సాగునీటి వాటాపై సందిగ్ధతే!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కృష్ణాడెల్టాపై ప్రభావం చూపనుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణను విభజిస్తున్నట్లు కాంగ్రెస్ అధి ష్టానం ప్రకటించిన నేపథ్యంలో కృష్ణాడెల్టాకు నీటి విడుదలపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే డెల్టాకు సాగునీటిని విడుదల చేయకుండా తెలంగాణ వాదులు అడ్డుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఆగస్టు వచ్చినా డెల్టాకు సాగునీటి విడుదలను చేయలేదు. సాగునీటి సంగతి అలా ఉంచితే సముద్రతీరంలోని అనేక గ్రామాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. డెల్టాకు తాగునీటి విడుదల కోసం ప్రభుత్వం వద్ద ప్రత్యేక జీవో లేకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతాయనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
130 టీఎంసీల నీరు అవసరం
కృష్ణాడెల్టాలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుకు ఏటా ఖరీఫ్‌లో 85 టీఎంసీలు, రబీలో 45 టీఎంసీల నీరు అవసరం. నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరితే ఒక క్రమపద్ధతిలో కాలువలకు వదలడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ గత ఏడాది నుంచి తప్పింది. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకు చేరితే డెల్టాకు నీటి విడుదల చేయకూడదని తెలంగాణవాదులు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ సమయంలోనే డెల్టాకు తాగునీటి కోసమైనా నీటిని విడుదల చేయాలని కోరితే ప్రత్యేక జీవో లేదనే విషయం బయటపడింది. గత ఏడాది డెల్టాకు సాగునీటిని అక్టోబర్‌లో విడుదల చేశారు. ఈలోపుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపునీటినే డెల్టాకు విడుదల చేశారు. రబీ సీజన్ వచ్చే సరికి నాగార్జునసాగర్‌లో నీరు అందుబాటులో లేదనే కారణం చూపి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
పోలవరం పూర్తవ్వడానికి ఐదేళ్లు
తెలంగాణ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర నీటి అవసరాలను తీర్చేం దుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జాతీయ హోదా కల్పిస్తామని సూచన ప్రాయంగా చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే చత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. రూ.15 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఎప్పటిలోగా పూర్తవతుందనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోల వరం ప్రాజెక్టుకు సంబంధించి కాలువ పనులు జరిగాయి. అనంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకునే వారే కరువయ్యారు. కోస్తాతీరంలో సముద్రంలో కలిసే గోదావరి, కృష్ణానదులు రెండూ తెలంగాణ ప్రాంతంలో నుంచే ప్రవహిస్తున్నాయి. తెలంగాణ విడిపోతే కర్ణాటక మాది రిగా ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నిస్తే డెల్టాకు సాగునీటి విడుదల పరిస్థితి ఏమిటనేది అర్థంకాని ప్రశ్న.
రాష్ట్ర విభజనలో నదీ జలాల వ్యవహారంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుంటే కృష్ణాడెల్టా ఎడారిగా ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నీ సక్రమంగానే చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నా ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తలెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించలేదు. ఇక రాష్ట్రం విడిపోతే నదీ జలాల వాటాల విషయంలో తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తే కృష్ణాడెల్టా రైతులకు కష్టషకాలం ప్రారంభం కావటం ఖాయం.