మెస్ చార్జీలు లేవు.. బతుకమ్మకు కోట్లా ?
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు రెండేళ్లుగా మెస్ చార్జీలు విడుదల చేయని ప్రభుత్వం..కేసీఆర్ కూతురు కవితకు మాత్రం బంగారు బతుకమ్మ ఆడటానికి కోట్ల రూపాయలు విడదల చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మ అంటే కవిత అన్నట్లు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని విర్శించారు.
కేంద్రం ప్రకటించిన ఫసల్ బీమాకు రాష్ట్రం చెల్లించాల్సిన డబ్బులు కట్టకుండా రైతులకు పరిహారం రాకుండా చేశారని అన్నారు. రాయితీ ట్రాక్టర్లను కూడా అర్హులైన రైతులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. భారత్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లో జవాన్లు చేసిన ప్రతి దాడి పట్ల జవాన్లకు యావత్ జాతి వందనం చేస్తోందని అన్నారు. ఆయన వెంట నాయకులు తాళ్లపల్లి కుమారస్వామి, కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి, వెంకటేష్ ఉన్నారు.