టెలి మెడిసిన్ ద్వారా కపిలేశ్వరపురం పీహెచ్సీలో వైద్య సేవలు
కపిలేశ్వరపురం, (పమిడిముక్కల) : కపిలేశ్వరపురం పీహెచ్‌సీని కామినేని హాస్పిటల్స్‌తో అనుసంధానం చేసి టెలి మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. కపిలేశ్వరపురంలో ఎన్ఆర్హెచ్ఎం నిధులు రూ.68.50 లక్షలతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రాధాన్యతాక్రమంలో జిల్లా, ఏరియా, పీహెచ్‌సీల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. రోగులను ఆప్యాయంగా పలకరించాలని , వైద్యులు సమయపాలన పాటించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారమందిస్తానన్నారు.
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఆసుపత్రి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తానని, అందుకు ఎంపీ, మంత్రి సహకరించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రికి ఎక్కువగా వచ్చే పేద వర్గాల వారికి మెరుగైన సేవలందించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత విషయాన్ని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన శ్రేయో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, చిగులూరి కృష్ణారావు సంఘం తరఫున చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రామంలోని చెరువులను సొసైటీల నుంచి తప్పించి పంచాయతీలకు అప్పగించాలని సంఘం వారు మంత్రిని కోరగా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. పీహెచ్సీ నిర్మాణానికి కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన దాత తాతినేని వెంకట నరసింహారావును మంత్రి, ఎమ్మెల్యే సత్కరించారు.
వైద్యాధికారి బి. లలితను మంత్రి, ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ఆర్జేడీ షాలినీ దే వి , డీఎంహెచ్ఓ సరసిజాక్షి, క్లస్టర్ అధికారి బాలకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య , జెడ్పీటీసీ సభ్యుడు ఎం. వెంకటసుబ్బయ్య , ఎంపీపీ ఎం. దుర్గమ్మ , సర్పంచి కె. కోటేశ్వరమ్మ, బిజెపి జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణారావు, మండల వైద్యాధికారి ఎస్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.