టెలీ స్కాంలో ముగ్గురి అరెస్ట్
బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ కుంభకోణంలో ముగ్గురిని సీబీఐ అధికారులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో మారన్ అదనపు ప్రయివేటు కార్యదర్శి గౌతమన్, సన్ టీవీ నిర్వాహకులు కన్నన్, రవి ఉన్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకేకు చెందిన దయానిధి మారన్ టెలికమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్న కాలంలో తన ఇంటి నుంచి సోదరునికి చెందిన సన్‌టీవీ గ్రూపు చట్టవిరుద్ధంగా 323 అక్రమ టెలిఫోన్ కనెక్షన్లను పొందారంటూ చెన్నైకి చెందిన జర్నలిస్టు ఎస్ గురుమూర్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీబీఐ 2007లో దయానిధి మారన్, బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యదర్శి కే బ్రహ్మన్, మాజీ సంయుక్త ప్రధాన కార్యదర్శి వేలుస్వామిలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 2011 నుంచి సీబీఐ విచారణ ప్రారంభించింది. సన్‌టీవీలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని సైతం సీబీఐ విచారించింది. ఇందులో భాగంగానే గౌతమన్తోపాటూ సన్‌టీవీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఎస్ కన్నన్, ఎలక్ట్రీషియన్ ఎల్ ఎస్ రవిని అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఒక సీబీఐ అధికారి చెప్పారు.
దయానిధి మారన్ ఇంటిలోని సన్‌టీవీ అనుబంధ కార్యాలయం, అక్కడి నుండి 3.4 కిలోమీటర్ల దూరంలోని సన్‌టీవీ ప్రధాన కార్యాలయం వరకు వేసిన రహస్య కేబుల్లైన్ను సీబీఐ పరిశీలిస్తోంది. ఈ కేసులో మరికొంత మంది అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన 323 బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను చెన్నై బోట్‌క్లబ్ సమీపంలోని దయానిధి మారన్ నివాసానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదేరకమైన కనెక్షన్లను సన్‌టీవీ కార్యాలయానికి సైతం మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ కనెక్షన్లు సాధారణమైనవి కావు. టీవీ ప్రసారాల్లో అత్యంత స్పష్టతను ఆనందించవచ్చు. ఈ రకమైన కనెక్షన్లను పద్ధతి ప్రకారం పొందాలంటే ఎంతో ఎక్కువ ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చును మినహాయించేందుకే అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అధికారి పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై ఆడిటర్ గురుమూర్తి ముందుగా ఫిర్యాదు చేసినా నాలుగేళ్ల క్రితం నుంచే విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత ఈ కేసులో తొలిసారిగా ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కుంభకోణం విలువ రూ.440 కోట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
ముగ్గురి వాంగ్మూలంతో మరి కొందరి అరెస్ట్
ఈ అరెస్ట్‌లపై ఒక సీబీఐ అధికారి మాట్లాడుతూ, టెలీ కుంభకోణంలో ప్రధాన నిందితులను పట్టుకునేందుకే ముగ్గురిని అరెస్ట్ చేశామని, వీరిచ్చిన వాంగ్మూలం ద్వారా మరి కొందరిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. 2007 మార్చిలో దయానిధి మారన్ ఇంటిలోని ఒక్క టెలిఫోన్ నెంబరు ద్వారానే 48 లక్షల 72 వేల 27 యూనిట్లు వినియోగించినట్లు ఆయన తెలిపారు. దయానిధి మారన్ ఇంటి నుంచి పొందిన అక్రమ కనెక్షన్ల ద్వారా సన్‌టీవీ వారు ఉచితంగా టెలిఫోన్ కాల్స్‌ను వినియోగించినట్లు భావిస్తున్నామన్నారు.
నేరం ఒప్పుకోవాలని వేధింపులు: దయానిధి మారన్
టెలిఫోన్ కనెక్షన్లలో అక్రమాలకు పాల్పడినట్లుగా తమవారిని వేధింపులకు గురిచేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఈ కుంభకోణంలో ప్రథమ ముద్దాయి దయానిధి మారన్ ఆరోపించారు. తనకు చెందిన ముగ్గురు అరెస్ట్‌కాగానే దయానిధి మారన్ గురువారం ఉదయాన్నే డీఎంకే అధినేత కరుణానిధి గృహానికి చేరుకున్నారు. 20 నిమిషాలపాటు ఇద్దరు మంతనాలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ తమవారిని హింసిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నకాలంలో ఇంటికి రూ.1 కోటి విలువైన అక్రమ కనెక్షన్లను పొంది వున్నట్లు 8 ఏళ్ల క్రితం సీబీఐ తనపై కేసును దాఖలు చేసిందని తెలిపారు. ఈ ఎనిమిదేళ్లలో సీబీఐ విచారణకు తాను అన్నివిధాల సహకరించానని తెలిపారు. తనను అరెస్ట్ చేసేందుకే తన సహచరుడిని, సన్‌టీవీ అధికారులను ముందుగా అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.
అరెస్టయిన ముగ్గురి భార్యలు రాష్ట్రపతి, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. చట్టవిరుద్దంగా తమ భర్తలను సీబీఐ అరెస్ట్ చేసి హింసిస్తున్నందున వెంటనే సురక్షితంగా ఇంటికి చేర్చాలని అందులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకు సీబీఐ పాల్పడుతోందన్నారు. ఆ మేధావి (ఆడిటర్ గురుమూర్తి)ని తృప్తి పరిచేందుకు సీబీఐ పాటుపడుతోందని విమర్శించారు. గతంలో మరో మేదావి తనను, తన కుమారుడిని కాపాడుకునేందుకు తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని పరోక్షంగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఎత్తిపొడిచారు. తాను నిర్దోషినని న్యాయస్థానంలో నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, అయితే సీబీఐ నిజాయితీగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఇంటిలోని టెలిఫోన్ కనెక్షన్లు టెలీ కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమోద్ మహాజన్ కాలం నాటి నుంచి ఉన్నాయన్నారు. అవే నంబర్లను ఇప్పటికీ వాడుతున్నానని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లకు వలె వాటికీ మీటర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రేణుకాచౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఆమె ఇంటి టెలిఫోన్‌కు రూ.15 లక్షలు అధికంగా వాడుకున్నట్లు తెలియడంతో చెల్లించేందుకు అంగీకరించారు. అలాగే తాను సైతం రూ.1 కోటి కట్టేందుకు సిద్ధంగా ఉన్నా, పక్షపాత వైఖరితో తనపై క్రిమినల్ కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు.
గురుమూర్తి వివరణ
టెలీ కుంభకోణం కేసుపై ఫిర్యాదుచేసి, దయానిధి మారన్ ద్వారా విమర్శలకు గురైన ఆర్ఎస్ఎస్ నేత ఆడిటర్ గురుమూర్తి మీడియాకు వివరణ ఇచ్చారు. సీబీఐ విచారణ, ముగ్గురి అరెస్ట్‌కు తాను కారణం కాదని, కాంగ్రెస్ హయాంలోనే కేసు నమోదైందని అన్నారు. సీబీఐ విచారణలో భాగంగానే ఈ అవినీతికి సంబంధించిన ఆధారాలను వెలుగులోకి తెచ్చానన్నారు. ఏడేళ్లుగా ఎవ్వరినీ అరెస్ట్ చేయని సీబీఐ ఇంతకాలానికి ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయడం విచిత్రమని అన్నారు. డీఎంకేతో చేతులు కలిపిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నందునే సీబీఐ విచారణ అటకెక్కిందని ఆరోపించారు. ఈ కారణం చేతనే కేసులో రాజకీయ జోక్యాన్ని నివారించి దోషులను శిక్షించాలని తాను హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు.