‘టెలీమెట్రీ’ ప్రాంతాల్లో మార్పులు
ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీ పరికరాలు అమర్చే ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముందుగా ప్రతిపాదించిన రెండు ప్రాంతాల్లో నెలకొన్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని మారుస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ఈ మేరకు మార్పులపై ఇరు రాష్ట్రాలకు మంగళవారం బోర్డు లేఖలు రాసింది. తొలి విడత జూరాల, శ్రీశైలం, సాగర్‌లో 18 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, రూ.4 కోట్లతో వాటి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్ వద్ద టెలీమెట్రీ ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించగా, దాన్ని 102.63 కిలోమీటర్‌కు మార్చాలని నిర్ణయించారు.
ఇక పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలీమెట్రీకి ప్రతిపాదించగా, దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు మార్చాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన ప్రతిపాదిత ప్రాంతంలో వాటిని అమర్చడం సహేతుకంగా లేని దృష్ట్యానే దీన్ని మార్చాల్సివస్తోందని బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే తెలంగాణ అధికారుల వివరణ మాత్రం ఇంకో రకంగా ఉంది. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ పరికరాలు పూర్తిస్థాయి డిశ్చార్జిలను చూపడం లేనందునే మార్పులు జరిగినట్లుగా వారు పేర్కొంటున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి ప్రవాహాలను లెక్కించాలంటే పూర్తి ఆటోమెటిక్ సెన్సార్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
రాష్ట్ర వాదనను దృష్టిలో పెట్టుకొని మరో చోట ఏర్పాటుకు బోర్డు నిర్ణయం చేసిందని తెలుస్తోంది. కాగా జూరాల పరిధిలో 7 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో 6 చోట్ల ఇప్పటికే అమర్చడం పూర్తయింది. సాగర్ పరిధిలో 3చోట్ల త్వరలో పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. శ్రీశైలంలో మాత్రం 4చోట్ల ఏర్పాటుకు సంబంధించి ఇంకా పరిశీలన దశలోనే ఉంది.